KTR లోని సత్తా చూడాలనుకుంటున్న కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకి హైదరాబాద్‌ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విజయం సాధించాక, హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కెసియార్‌, ఆ బాధ్యతని కెటియార్‌ భుజాల మీద పెట్టారు. ఐటి రంగంలో హైదరాబాద్‌ని అగ్రస్థానానికి తీసుకెళ్ళేలా కసరత్తులు చేస్తున్న కెటియార్‌, హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం కెటియార్‌ చేస్తున్న చర్యలు అభినందనీయమే. అయితే హైదరాబాద్‌లో రోడ్లు నరకానికి కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌ ఎలా ఉంటుందో అలా హైదరాబాద్‌లోని అన్ని రోడ్లూ మార్చాలని కెటియార్‌ అనుకోవడాన్ని ఆహ్వానించగలంగానీ, అది సాధ్యమవుతుందని అనుకోగలమా? మిగతా రాజకీయ నాయకులకి కెసియార్‌కి చాలా వ్యత్యాసం ఉందని, కెసియార్‌ అనుకుంటే అయిపోతుందనీ, ఆ నమ్మకంతోనే కెసియార్‌, తన కుమారుడికి హైదరాబాద్‌ అభివృద్ధి బాద్యతలు అప్పగించారని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.

గడచిన రెండేళ్ళలో హైదరాబాద్‌ స్థితిగతుల్లో మార్పులేమీ రాలేదు. మెట్రో రైల్‌ కూడా పూర్తి కాలేదు. అది పూర్తయితే కొంతవరకు ట్రాఫిక్‌ తగ్గి, రోడ్ల మరమ్మత్తులకు మార్గం సుగమం అవుతుంది. కెటియార్‌ కూడా ఈ కోణంలోనే ఆలోచన చేస్తున్నారట. హైదరాబాద్‌ తెలంగాణకి గుండెకాయ అని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గితే, తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన గ్రహించారు. అందుకే హైదరాబాద్‌ అద్దంగా వెలిగిపోవడానికి తగిన చర్యల్ని కెటియార్‌ తీసుకుంటున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.