ముద్రగడకి మళ్ళీ నిరాశే

తుని విధ్వంసం ఘటనలో అరెస్టయినవారంతా విడుదలైతే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమిస్తారు. ఈ రోజే మిగిలిన ముగ్గురికి బెయిల్‌ రవచ్చని ముద్రగడ వర్గీయులు అంచనా వేశారు. బెయిల్‌ వస్తే, దీక్ష విరమణకి కూడా ఏర్పాట్లు చేయవచ్చనుకున్నారు. సొంత గ్రామం కిర్లంపూడిలోనే దీక్ష విరమణకోసం ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ ముగ్గురి బెయిల్‌ విషయంలో విచారణ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి రెండుసార్లు నిరాహార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు చేస్తున్నది రెండో దీక్ష. మొదటిది ప్రశాంతంగానే అతి తక్కువ రోజుల్లో ముగియగా, రెండో దీక్ష నాటకీయ పరిణామాల మధ్య పది రోజులుగా జరుగుతోంది. వయసు, ఇతర అనారోగ్య సమస్యల రీత్యా ప్రభుత్వం ఆయన దీక్ష పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీక్ష విరమణకు ముద్రగడ ససేమిరా అంటున్నప్పటికీ, కేసులు నమోదైన తర్వాత వారిని విడిచిపెట్టడం తమ చేతుల్లో ఉండదని ప్రభుత్వం తన మాటగా ఇప్పటికే ముద్రగడకి తెలియజేసింది. ఇంకో వైపున దీక్ష విరమించేయడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయన్న వార్తతో ముద్రగడ కుటుంబ సభ్యులూ ఆయన దీక్ష విరమణ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీక్ష విరమణకు ఇంకో రోజు పట్టేలా ఉంది. రేపు బెయిల్‌ వస్తే రేపు సాయంత్రానికే ముద్రగడ దీక్ష విరమించే చాన్స్‌ ఉందని సమాచారమ్‌.