మేస్టారు వీక్‌ కాదు, యమ స్ట్రాంగ్‌

పిల్లలకు పాఠాలు చెప్పుకునే మేస్టారు, రాజకీయంగా తాను కొట్టే దెబ్బను తట్టుకోలేరులే అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విషయంలో అనుకుని, భంగపడినట్లున్నారు. కెసియార్‌ కారణంగానే కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా కనిపించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. అక్కడికి కోదండరామ్‌ చాలా సంయమనం పాటించారు. రెండేళ్ళు వేచి చూసి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు తీరతాయనీ, తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని కోదండరామ్‌ భావించారు. అయితే కెసియార్‌ పాలన, సమైక్య పాలనకు మించి భిన్నంగా లేదని కోదండరామ్‌కి అర్థమయ్యింది. పాలకులు ఎక్కడైనా పాలకులేనని తెలుసుకున్న కోదండరామ్‌, ప్రజల కోసం సొంత ప్రభుతాన్ని అయినా ప్రశ్నించక తప్పదనుకున్నారు. అనుకున్నదే తడవు విమర్శలు చేశారు. టిఆర్‌ఎస్‌ కూడా ఎదురుదాడికి దిగింది. కానీ కోదండరామ్‌ వెరవలేదు. వ్యక్తిగతంగా ఆ విమర్శలకు సమాధానమివ్వకుండా, తెలంగాణ జెఎసి తరఫున సమాధానం చెప్పి, తాను మేధావినని నిరూపించుకున్నారు. మేస్టారు వీక్‌ కాదు, యమ స్ట్రాంగ్‌ అని తెలంగాణ జెఎసి సమావేశం అనంతరం టిఆర్‌ఎస్‌పై కోదండరామ్‌ చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది తెలంగాణ సమాజానికి.