మావయ్య బాటలో మెగా మేనల్లుడు

మెగా మేనల్లుడిగా ‘రేయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్‌ తేజ. తాజాగా ‘సుప్రీం’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. మేనమామ పోలికలను అంది పుచ్చుకోవడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా మావయ్య చూపిన బాటలోనే అడుగులేస్తున్నాడు. సేవా కార్యక్రమాల్లో సినీరంగంలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. పబ్లిసిటీతో సంబంధం లేకుండా తమ వంతు సేవలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మెగా ప్యామిలీ తరువాతే ఇంకెవరైనా.. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ కూడా ప్రస్తుతం అదే పని చేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులను కలిసి, వారితో చాలా సేపు సరదా సరదాగా గడిపాడు. వారికి గిఫ్ట్స్‌, చాక్లెట్లు ఇచ్చాడు. వారిలో ఆత్మస్థయిర్యాన్ని పెంచాడు. ప్రస్తుతం సాయి ధరమ్‌ హీరోగా నటిస్తున్న ‘తిక్క’ సహా పలు సినిమాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఈ లోపల పలు సేవా కార్యక్రమాలకు కూడా తన టైంలో కొంత టైం కేటాయించాలనుకుంటున్నాడు. అయితే సొంతంగా సేవా కార్యక్రమాలు చెయ్యడమెందుకు, మావయ్య చూపిన బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తానంటున్నాడు. మావయ్యే అన్నిటికీ రోల్‌ మోడల్‌ అంటున్నాడు. తెరపై హీరోయిజమే కాదు, తెరవెనుక మానవత్వం కూడా అవసరమంటాడు ఈ యంగ్‌ హీరో. మొత్తానికి ఆ మామకు అల్లుడిగా కేవలం నటనే కాకుండా, అన్ని రకాల పనుల్లోనూ భాగం పంచుకుంటానంటున్నాడు ఈ సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ.