టార్గెట్‌ కేసీఆర్‌: కోదండరామ్‌ వదల్లేదు

కేసీఆర్‌ని టార్గెట్‌ చేయడం ఇప్పట్లో మానేలా లేరు తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌. విదేశాలకు వెళ్ళి వచ్చిన కోదండరామ్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌పై విమర్శలకే వాడుకోవడం ద్వారా ‘టార్గెట్‌ కేసీఆర్‌’ మిషన్‌ని యాక్టివ్‌గానే ఉన్నట్లు సంకేతాలు పంపారాయన. తెలంగాణ ఉద్యమంలో కెసియార్‌తో కలిసి పనిచేసిన కోదండరామ్‌, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కెసియార్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే తనను దాటేసి వెళ్ళిపోతున్నారని భావించిన కెసియార్‌ అప్పటినుంచే కోదండరామ్‌పై ఓ కన్నేశారు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా కెసియార్‌ కోదండరామ్‌ని దూరం పెట్టారు. రెండేళ్ళు వేచి చూసిన కోదండరామ్‌, సరైన పాయింట్‌ పట్టుకుని కెసియార్‌కి గట్టి పోటీగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తామంటూ ఊరుకోబోమని ప్రజల తరఫున ఉద్యమం చేస్తామని కోదండరామ్‌ నినదించడంతో కెసియార్‌ డిఫెన్స్‌లో పడిపోయారు. ఈ ఉద్యమం కొనసాగుతుందని కోదండరామ్‌ తాజాగా ప్రకటించారు. దాంతో ఇప్పటికే కోదండరామ్‌పై తన అనుచరగణంతో విమర్శలు చేయించిన కెసియార్‌, కొత్త వ్యూహాలతో కోదండరామ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారమ్‌. తెలంగాణ జెఎసి వేదికపైనుంచే అన్ని పార్టీలనూ కలుపుకపోయి, కెసియార్‌ని ఎదుర్కోవాలనే వ్యూహంలో కోదండరామ్‌ కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు.