జగన్‌ కూడా ఛలో విజయవాడ 

ఆంధ్రప్రదేశ్‌ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి వెళ్ళడంతో అక్కడే పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాలు నడపాల్సి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినాసరే. అందుకే వైఎస్‌ జగన్‌ కూడా విజయవాడకు తరలి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట.

కృష్ణా – గుంటూరు జిల్లాల మధ్యలో కొత్త ఇంటిని, అలాగే కార్యాలయాన్ని నిర్మించుకోవాలనే యోచనలో జగన్‌ ఉన్నారని సమాచారమ్‌. జగన్‌ సొంత జిల్లా కడప అయినప్పటికీ హైదరాబాద్‌, బెంగళూరుల్లో అద్భుతమైన భవంతుల్ని ఆయన నిర్మించుకున్నారు. ఆ భవనాల్ని తలదన్నేలా వైఎస్‌ జగన్‌ గుంటూరు – కృష్ణా జిల్లాల మధ్యలో నిర్మంచుకోనున్నారని టాక్‌ వినవస్తోంది. జగన్‌తోపాటుగా పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ నాయకులు, అలాగే ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నివాసం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారట.