వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార పార్టీ టార్గెట్ చేసింది. వరుస కేసులతో ఆయనను బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని అసైన్డ్ భూముల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్‌మెంట్, మద్యం కుంభకోణం తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలంటూ మొత్తం ఆరు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో కూడా చంద్రబాబుతో పాటు, నాటి ఆయన మంత్రివర్గ సహచరులను నిందితులుగా చేర్చింది. మద్యం కేసులో అప్పుడు ఎక్సైజ్ కమీషనర్‌గా ఉన్న ఐ.శ్రీనివాస్ నరేష్ ను ఏ-1 గా చేర్చారు. కానీ, నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కల్లాంను వదిలేశారు. తాజాగా, నమోదు చేసిన ఇసుక అక్రమాల కేసులో ఏ-1 గా మాజీమంత్రి పీతల సుజాత, ఏ-2 గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ-3 గా చింతమనేని ప్రభాకర్, ఏ-4 గా దేవినేని ఉమా పేర్లను చేర్చారు. మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కూడా ఉన్నారని సీఐడీ అందులో పేర్కొంది. ఇసుక పాలసీని తెలుగుదేశం ప్రభుత్వం మొదట ఇసుక రీచ్ లను మహిళా సమాఖ్యలకు కేటాయించి ఆ తరువాత అకస్మాత్తుగా విధానాలు మార్చి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారంటూ, దీని వెనుక పెద్ద దురుద్దేశం దాగి ఉందని ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్నారు. ప్రధానంగా, తెలుగుదేశం పార్టీ నేతల జేబులు నింపేందుకే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. కనీసం ఉచిత ఇసుకను ప్రవేశపెట్టే ముందు దీని పై క్యాబినెట్ లో చర్చ కానీ, బిజినెస్ రూల్స్ ప్రకారం ఫైల్ నడపలేదని కూడా ఆరోపించారు. అందువల్లే కేసు నమోదు చేస్తునట్టు పేర్కొన్నారు.

ఈ కేసులన్నీ సీఐడీ అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నప్పటికీ, వీటిలో ఏ కేసుకు కూడా రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నట్టు ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొనలేదు. చివరకు తాజాగా నమోదు చేసిన మద్యం, ఇసుక కేసుల్లో కూడా అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ అంశాన్ని కూడా ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొనాల్సి ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయగా, ఆ చట్టంలోని 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, అందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ కొట్టివేయాలని ఇప్పటికే చంద్రబాబు సుప్రీంకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. వాదనలు పూర్తి అవ్వడంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చంద్రబాబు పై తాజాగా నమోదు అయిన కేసు విషయంలో కూడా గవర్నర్ అనుమతి తీసకున్న పరిస్థితి కనిపించడం లేదని టీడీపీ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.