మునుగోడులో రసవత్తరంగా త్రిముఖ పోటీ

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి.. టికెట్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన చల్లమల కృష్ణారెడ్డి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మునుగోడులో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజాతీర్పు డిఫరెంట్ గా ఉండే నియోజకవర్గమే మునుగోడు. అధికారంలో ఉన్న పార్టీకి ఇక్కడ మాత్రం ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యే ఉండటం ప్రత్యేకత. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. 2022 లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి కాషాయకండువా కప్పుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బైపోల్‌ సమయంలో చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరి.. మునుగోడు టికెట్‌ ఆశించారు. ఆర్థిక, అంగబలం ఉన్న చలమల్ల కృష్ణారెడ్డి.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అనుచరుడు కావడంతో టికెట్‌ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పార్టీ నాయకత్వం కాంగ్రెస్‌ మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓటమి తప్పలేదు. 2023తో మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ను చలమల్లకే ఇస్తామని ఉప ఎన్నిక సమయంలోనే పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అందుకే ఆయన కాంగ్రెస్ వెంట నడిచినట్లు చల్లమల అనుచరులు చెబుతున్నారు.

కానీ తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి.. బీజేపీకి రాజీనామా చేసి.. తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. దీంతో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది. కొంతకాలం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో కొద్దిగా క్రియాశీలకంగా మారినా.. ఇటీవల కమల దళానికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌లో చేరి మునుగోడు టికెట్‌ తెచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ టికెట్ ఆశించిన పాల్వయి స్రవంతి, చలమల్ల కృష్ణా రెడ్డి, పున్నా కైలాష్ అసమ్మతితో రగిలి పోయారు. రాజ్ గోపాల్ రెడ్డి దిష్టి బొమ్మను కృష్ణా రెడ్డి అనుచరులు దహనం చేయడం కలకలం సృష్టించింది. 15 నెలలుగా కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన తనను మోసం చేసారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించి.. రాజ్ గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే బలమైన పార్టీతోనే సాధ్యమని భావించారు చల్లమల. అందరి అభ్రియాన్ని పరిగణలోకి తీసుకున్న చలమల్ల కృష్ణా రెడ్డి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడు బరిలోకి దిగుతున్నారు.

గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్య గట్టి పోటీ జరిగింది. పది వేల ఓట్లకు పైగా మెజారిటీతో బీఆర్ఎస్ గెలిచింది. కానీ రాజగోపాల్ రెడ్డి పోటీతో నియోజకవర్గంలో బీజేపీ గుర్తు ప్రజల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి, వాహనాలతో సహా సర్వం సిద్ధం చేసుకొని భంగపడిన చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కృష్ణారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో హోరాహోరీ పోరు జరుగుతోంది. కానీ గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి డిపాజిట్‌ దక్కలేదు. అప్పట్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌కు గండికొట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడంతో బీజేపీకి ఎలాంటి ఆదరణ ఉంటుందో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద మునుగోడులో త్రిముఖ పోటీ జరుగుతోంది. మరి ఏ పార్టీ గుర్తు వైపు ప్రజలు ఉంటారో… ఏ నాయకుడిని ఆదరిస్తారో.. చూడాలి.