ముంబైలో ఖ‌రీదైన ఫ్లాట్‌ కొన్న క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు.. సినిమాలు లేక‌పోయినా అస్స‌లు త‌గ్గ‌ట్లేదు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కు ఇద్ద‌రు కూతుళ్లు అన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద కూతురు శృతి హాస‌న్ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతోంది. చేతి నిండా సినిమాల‌తో తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. సింగ‌ర్ గానూ ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర హాస‌న్. ఈమె కూడా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. మొద‌ట ప‌లు సినిమాల‌కు, యాడ్స్ ఫిల్మ్స్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసింది.

ఆ త‌ర్వాత ధనుష్ సరసన షమితాబ్ సినిమాలో కథానాయికగా ఆమె తెరంగేట్రం చేసింది. 2015లో ఈ బాలీవుడ్ మూవీ విడుద‌లైంది. ఆ త‌ర్వాత కూడా ప‌లు సినిమాలో అక్ష‌ర హాస‌న్ యాక్ట్ చేసింది. కానీ, అక్క రేంజ్ లో స‌క్సెస్ అవ్వ‌డ‌లేక‌పోయింది. అయితే చేతిలో సినిమాలు లేక‌పోయినా అక్ష‌ర అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో ఖ‌రీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసి వార్త‌ల్లో నిలిచింది.

ముంబై పశ్చిమ శివారులోని ఖర్ రోడ్డు నెంబ‌ర్ 16లో 2,354 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను అక్ష‌ర హాస‌న్ తాజాగా త‌న సొంతం చేసుకుంది. 15 అంతస్తుల లగ్జరీ టవర్ ఏక్తా వెర్వ్‌లో 13వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాసంగా ఉండే ఈ ఫ్లాట్ ఖ‌రీదేంతో తెలుసా.. రూ. 15.75 కోట్లు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయింది. ఈ అపార్ట్‌మెంట్ కు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.