టాలీవుడ్ బడా డైరెక్టర్ కు హైకోర్టు నోటీసులు…!?

తెలుగు చిత్ర పరిశ్రమలో బడా డైరెక్టర్లలో ఒకరు దర్శకేంద్రుడు కే.రాఘవేందర్రావు గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో ఘన విజయాలను అందించిన ఈయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈయనకు తెలంగాణ హై కోర్ట్ నుంచి నోటీసులు అందాయని సమాచారం. ఈ నోటీసులకు కారణం ఆయన ఒక భూమి వివాదంలో చిక్కుకోవడమేనట. ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిని ఆయన తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు రాఘవేందర్రావు గారు. ఈ విషయం మేరకు దాఖలైన పిల్ పై స్పందిస్తూ హై కోర్ట్ ఆయనకు సమన్లు పంపింది. ఈ కేసు లో భాగంగా రాఘవేందర్రావు గారితో పాటు ఆయన బంధువులకు కూడా సమన్లు అందాయని సమాచారం.

వివరాలలోకి వెళ్తే, కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలోని షేక్ పెట్ ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఈ భూమిని ఆయన పరిశ్రమ అభివృద్ధి కోసం కాకుండా తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించారన్నది ఆరోపణ. ఈ విషయమై గతంలో ఒకసారి కోర్ట్ నిందితులకు నోటీసులు పంపినప్పటికీ, అవి వారికి అందినట్లు రికార్డులలో లేకపోవడంతో మళ్ళీ గురువారం నోటీసులు పంపిందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ కేసు తదుపరి విచారణను జనవరి 18 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కోర్ట్.

ఈ పిల్ ను మెదక్ జిల్లాకు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012 లో దాఖలు చేసారు. 403/1 సర్వే నెంబర్ కింద 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వాడుకోవడం చట్టానికి విరుద్ధమని బాలకిషన్ పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై తెలంగాణ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ యెన్ శ్రవణ్ కుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. నిందితులైన రాఘవేందర్రావు, ఆయన బంధువులు చక్రవర్తి, కృష్ణ మోహనరావు, అఖిలాండేశ్వరి, లాలస, విజయలక్ష్మి లకు సమన్లు పంపింది.