ఎన్టీఆర్ గురించి నోరు జారిన పోసాని.. ఫ్యాన్స్ ఫైర్..!

ప్రముఖ సినీనటుడు, రచయిత ,దర్శకుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఏ విషయాన్ని అయినా సరే ఆయన వ్యంగంగా మాట్లాడడంలో తన శైలి వేరుగా నిరూపించుకుంటూ ఉంటారు. అయితే అలా మాట్లాడి చాలా సందర్భాలలో వివాదాలలో కూడా చిక్కుకున్నారు. వైసిపి పార్టీకి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుడుగా కొనసాగుతున్న పోసాని తాజాగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. కాస్త నోరు జారారు. ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. ఇండస్ట్రీ అందరిది.. ఎంబీఏ లాంటి పై చదువులు చదువుకున్న వారు కూడా ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులుగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అయినా.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక్కటే.. అందరూ ఆర్టిస్టులే.. చిన్న పెద్ద అని తేడా ఉండకూడదు అంటూ పోసాని తెలిపారు. ఇక పెద్ద హీరోయిన్ అయినా చిన్న హీరోయిన్ అయినా కూడా ఒక్కటే.. ఏపీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు.. టెక్నీషియన్లు కూడా ఉన్నారు.. వారందరినీ గుర్తించి వారికంటూ ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తాము అని తెలిపారు.

అయితే ఇక్కడ పోసాని కృష్ణమురళి జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి మాట్లాడకపోయినా జూనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం అభిమానులకు నచ్చడం లేదు. ఇక పోసాని జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ , నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోసాని ఏపీలో ఉన్న చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ విధంగా నోరు జారారు. మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.