తెలుగుదేశం పార్టీలో కొత్త లీడర్ వచ్చేశారు…!

తెలుగుదేశం పార్టీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ చేశారనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 42 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుపై మరి కొన్ని కేసులు కూడా సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఇప్పటికే పీటీ వారెంట్‌లు దాఖలు చేశారు సీఐడీ అధికారులు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీని ముందుకు నడిపే నేత కరువయ్యాడనే చెప్పాలి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీలో చాలా మంది కీలక నేతలు సుమారు 3 రోజుల వరకు బయటకు రాలేదు. ఇందుకు ప్రధాన కారణం… తమను కూడా సీఐడీ అరెస్టు చేస్తుందేమో అనే భయం. దీంతో కొంత మంది నేతలు స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తమను తాము హౌస్ అరెస్టు చేయించుకున్నారనే ఆరోపణలు కూడా సొంత పార్టీలో వినిపిస్తోంది. చంద్రబాబు జైలులోకి వెళ్లిన రెండు రోజుల తర్వాత బయటకు వచ్చిన నేతలు… నిరసనల పేరుతో మమ అనిపిస్తున్నారు తప్ప… పెద్దగా చేసింది ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దాదాపు నెలన్నర తర్వాత టీడీపీ నేతలు మేలుకున్నట్లుగా కనిపిస్తోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఢిల్లీ వెళ్లారు. కేసుల గురించి న్యాయవాదులతో చర్చలని చెప్పినప్పటికీ… కేసుల్లో అరెస్టు కాకూడదనే లోకేశ్ ఢిల్లీ వెళ్లారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి లోకేశ్‌ను అరెస్టు చేయమని కోర్టుకు సీఐడీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. అయితే పార్టీని నడిపించే భవిష్యత్తు నేతగా లోకేశ్‌ పేరు చెబుతున్నప్పటికీ… పూర్తిస్థాయిలో నమ్మకం అయితే పార్టీ నేతలు చూపించడం లేదు. అందుకే తాజాగా లోకేశ్ బదులుగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు టీడీపీ నేతలు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో నారా, నందమూరి కుటుంబాలకు చెందిన లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి కూడా పొలిటికల్ ఎంట్రీ కోసం ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో కుటుంబ సభ్యుల కోసం ప్రచారం చేసిన బ్రాహ్మణి… త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీని నడిపించేందుకు కొత్త నేత వస్తున్నారనే మాట బలంగా వినిపిస్తోంది.