బాబు ఇప్పట్లో బయటకు రానట్లేనా….!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పట్లో బయటకు రారా… ఆయన బయటకు రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది…. ఈసారి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు జైలులోనేనా… ప్రస్తుతం ఇవే ప్రశ్నలు టీడీపీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. పైకి మాత్రం మా నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నప్పటికీ… ఆ ముత్యం ఎప్పుడు అవుతుందో.. ఎప్పుడు బయటకు వస్తారని అడిగితే మాత్రం… నో కామెంట్ అనేస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం… చంద్రబాబు ఇప్పట్లో బయటకు రారు అని సొంత పార్టీ నేతలే హింట్ ఇచ్చేస్తున్నారు.

తొలిసారి చంద్రబాబు నాయుడు లేకుండా పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించేందుకు పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. మధ్యలో ఓ సారి పాదయాత్ర ప్రారంభిస్తా అంటూ లోకేశ్ ప్రకటించినప్పటికీ… తనను కూడా అరెస్టు చేస్తే అని భయంతో వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో అరెస్టు ఉండదని క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించాలని లోకేశ్ నిర్ణయించారు. పాదయాత్రకు బదులుగా భవిష్యత్తుకు గ్యారెంటీ, ఏపీ హేట్స్ జగన్ వంటి కార్యక్రమాలు డోర్ టూ డోర్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో నారా భువనేశ్వరి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని పార్టీ నేతలు తీర్మానం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే… చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే… చంద్రబాబు వస్తే… లోకేశ్ పాదయాత్ర కొనసాగించవచ్చు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బాబు కంటిన్యూ చేయవచ్చు. కానీ బాబు రాడని తేల్చుకున్నారు కాబట్టే… ముందు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపైనే టీడీపీ నేతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.