ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుగుతాయని ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో రాబోయే 3 నెలలు ప్రతి ఒక్కరికీ కీలకమని కూడా ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు కూడా. రాబోయే ఎన్నికల్లో ఇవే తమకు ఓట్లు పడేలా చేస్తాయని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు. వై నాట్ 175 అంటున్న జగన్… రాబోయే ఎన్నికల్లో సుమారు 70 మంది సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు లేవని కూడా తేల్చేశారు. దీంతో కొత్త నేతలు ఎవరూ అనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది.
ప్రధానంగా పార్టీలో కొత్తగా ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నయి. విజయ్ కుమార్, కలికాల వళవన్ లు ఇద్దరు ఈ సారి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయని… అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కరికాల వళవన్ తిరుపతి ఎంపీగా పోటీ చేస్ అవకాశాలున్నాయంటున్నారు వైసీపీ నేతలు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తమిళుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వళవన్ తిరుపతి పని చేసిన సమయంలో… పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయనను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో అధికారి విజయ్ కుమార్ పేరు కూడా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నందిగాం సురేశ్ రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాడికొండ నియోజకవర్గం కోరుకున్నప్పటికీ… జగన్ మాత్రం సురేశ్‌ను యర్రగొండపాలెం పంపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి విజయ్ కుమార్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.