జనసేన – టీడీపీ నేతలను కలవరపెడుతున్న పొత్తుల వ్యవహారం..!?

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాదాపు ఏడాదిన్నరగా తేలని పొత్తుల వ్యవహారం… రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన తొలి ములాఖత్‌లోనే తేలిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో ములాఖత్ భేటీ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ తర్వాత జరిగిన పవన్ నాలుగో విడత వారాహి యాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య పొలిటికల్ సర్కిల్‌లో తెగ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీల నేతలు పరస్పరం సహకరించుకుంటారా లేదా… అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో విబేధించిన పవన్… ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 140కి పైగా స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడంతో… ఆ ప్రభావం టీడీపీ అభ్యర్థులపై స్పష్టంగా పడింది. పలుచోట్ల టీడీపీ ఓటమికి జనసేన అభ్యర్థుల ఓట్లే కారణం అనేది బహిరంగ రహస్యం. ఇక ఎన్నికల తర్వాత నుంచి టార్గెట్ వైసీపీ అన్నట్లుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం.. అందుకు జనసైనికులు కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడేలా కార్యకర్తలు పని చేశారు. అటు నేతలు కూడా రాబోయే ఎన్నికల్లో మరోసారి తమకే టికెట్ అన్నట్లుగా నాలుగున్నరేళ్లుగా పని చేస్తున్నారు.

తాజాగా టీడీపీతో పొత్తు నేపథ్యంలో సీట్ల కేటాయింపు… అభ్యర్థుల పోటీ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సహకరిస్తారా… టీడీపీ పోటీ చేసే చోట జనసైనికులు ప్రచారం చేస్తారా అని ఇరు పార్టీ నేతలు భయపడుతున్నారు. నాలుగున్నరేళ్లు కష్టపడిన తర్వాత.. ఇప్పుడు సీటు తనకు రాకుండా… వేరొకరికి ఇస్తే… ఇంతకాలెం పెట్టిన ఖర్చు వృధాతో పాటు తన కార్యకర్తల వద్ద పరువు కూడా పోతుందనేది ఆయా పార్టీ నేతల మాట. పక్క పార్టీ నేత గెలిస్తే… నియోజకవర్గంలో తన పట్టు జారిపోతుంది కదా అనే భయం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిత్రపక్షం అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలా వద్దా… చేస్తే తన రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏమిటీ… అనేది ఇప్పుడు ఇరు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.