మేమేం చేయాలో మీరే చెబితే ఎలా… రేవంత్ ఫైర్….!

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 3న కౌటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ… బీ ఫామ్ ఇచ్చే వరకు టికెట్ తమకే వస్తుందో రాదో అని బీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు. ఇక బీజేపీ అయితే… ఇప్పటికే రాష్ట్రంలో అటు మహబూబ్‌నగర్, ఇటు నిజమాబాద్‌లో ప్రధాని మోదీతో సభలు నిర్వహించింది. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలి సభ ఇదే కావడం కూడా విషయం. ఇక అదిలాబాద్ సభ అనంతరం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా… నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక అంశాలు చర్చించారు. అభ్యర్థుల జాబితాను దాదాపు ఫైనల్ చేసినట్లున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే వారి కోసం దరఖాస్తులు స్వీకరించింది. అలా అప్లికేషన్ పెట్టుకున్న వారిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి.. ఆ జాబితాను హై కమాండ్‌కు పంపారు కూడా. దీంతో.. అభ్యర్థుల ఎంపిక దాదాపు చివరి ఘట్టానికి చేరుకున్నట్లే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గదిలో ఏం చర్చ జరిగిందో పూర్తిగా తెలియకుండానే బయటకు వార్తలు రాసేస్తున్నారని విమర్శించారు. పొత్తులపై కూడా నిర్ణయం తీసుకున్నామని… సీట్లతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిపోయిందని ఇప్పటికే ఛానల్స్‌లో వెబ్ సైట్లల్లో వార్తలు వస్తున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. మేము చెప్పకుండాన… మీరే ముందుగా ప్రకటించడం వల్ల కింది స్థాయి కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కూడా రేవంత్ హెచ్చరించారు. తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని… ఎవరు మీడియా దగ్గరకు వెళ్లి అసహనం వ్యక్తం చేయవద్దని కూడా తమ పార్టీ నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి. మేము అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఆ జాబితాను ప్రచురించాలని మీడియాకు రేవంత్ సూచించారు.