వి.వి.వినాయక్ తెలుగు పరిశ్రమలోకి రావడానికి కారణం ఇదేనా!

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి వినాయక్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో టాప్ తెలుగు చిత్రాల దర్శకుడిగా పేరుగాంచారు. ముఖ్యంగా యాక్షన్, కామెడీ అలాగే మసాలా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన 2000 వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అతనికి కమర్షియల్ గా విజయం అందించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకుగాను ఉత్తమ మొదటి డైరెక్టర్ గా రాష్ట్ర నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

ఆ తరువాత 2003లో నితిన్ నటించిన దిల్ అలాగే చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రాలకి దర్శకత్వం వహించగా, రెండు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. 2006లో దుబాయ్ లో జరిగిన IIFA అవార్డ్స్ లో ఈ సినిమాలను ప్రదర్శించారు కూడా. ఇక ఆ తరువాత మనోడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. 1969 అక్టోబర్ 9 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో జన్మించిన వివి వినాయక్ అసలు పేరు గండ్రోతు వీర వెంకట వినాయకరావు. వీరి తండ్రి సినిమా హాల్ నడిపేవారు. అలా ఎప్పుడూ సినిమాలను చూస్తూ పెరిగిన వివి వినాయక్ చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నారు. ఊరికి పొరుగు గ్రామమైన దొమ్మేరులో తన అమ్మమ్మ ఇంటి నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు వినాయక్.. విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత తన తండ్రిని ఒప్పించి ఈవివి సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.

ఈ క్రమంలో 1993లో వచ్చిన అబ్బాయిగారు సినిమాకు మొదటిసారి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అమ్మదొంగ చిత్రానికి డైరెక్టర్ సాగర్ వద్ద పనిచేశారు. కుటుంబ సపరివార సమేతంగా చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డికి సహకరించి.. పాడుతా తీయగా, 9 నెలలు వంటి చిత్రాలకు గాను క్రాంతి కుమార్ కు సహాయాన్ని అందించారు. ఆ తర్వాత ఆది సినిమాతో డైరెక్టర్ గా మారి.. ఎంతోమంది హీరోలకు మంచి విజయాలను అందించారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు హీరోలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఆయన సినీ ప్రస్థానం.