పల్లెబాట..వైసీపీ భారీ స్కెచ్.!

ఒకే ఒక దెబ్బతో టి‌డి‌పి కార్యక్రమాలకు బ్రేకులు పడిపోయాయి.ప్రజల్లోకి వెళ్ళడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు..టి‌డి‌పి నేతలు ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేస్తున్నారు. బాబు సైతం రోడ్ షోలు, సభలతో బిజీగా ఉన్నారు. అటు లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇలా టి‌డి‌పి..వైసీపీ టార్గెట్ గా రాజకీయం చేస్తుంది. కానీ బాబు అరెస్ట్ తో టి‌డి‌పి మొత్తం ఇప్పుడు బాబు ఎప్పుడు బయటకొస్తారా? అని ఎదుచూస్తున్నారు.

ఇదే సమయంలో బాబుపై వరుస కేసులు..ఇప్పుడే బయటకొచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో టి‌డి‌పి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే వైసీపీ ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్లాన్ చేసింది. ముఖ్యంగా రూరల్ ఓటర్లని ఆకట్టుకోవడానికి జగన్ భారీ స్కెచ్ వేశారు.  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా గ్రామాలపైన ఫోకస్ చేశారు. సంక్షేమ పథకాలు, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే కేంద్రాలు, నాడు-నేడు, హెల్త్ సెంటర్లు వంటి నిర్ణయాలతో గ్రామీణ ఓటర్లని ఆకట్టుకునేలా ముందుకెళ్లారు.

ఇక వారిని మరింత ఆకట్టుకోవడానికి ఇప్పుడు పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లోనే ఉండాలని ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలను జగన్ ఆదేశించారు. అంతేకాదు టీడీపీ, జనసేన పొత్తును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవసరమైన చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అటు ప్రతి సచివాలయ పరిధిలో పథకాల లబ్దిదారులతో పార్టీ నేతలు మమేకం కానున్నారు.

టి‌డి‌పి ఏమో బాబు అరెస్ట్ చుట్టూ తిరుగుతుంటే జగన్ మాత్రం పల్లెకి పోదాం అంటూ పార్టీ నేతలని గ్రామాల్లో తిప్పి..రూరల్ ఓటర్లని ఆకట్టుకుని మరింతగా పార్టీకి మైలేజ్ పెంచుకొనున్నారు.