వైసీపీ కంచుకోటల్లో కొత్త తలనొప్పి..సెట్ చేసేది ఎవరు?

పశ్చిమ ప్రకాశం అంటే వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు..ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలమైన స్థానాలు..యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి లాంటి స్థానాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే ఆయా స్థానాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. దీని వల్ల పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది.

ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డిలకు పడటం లేదు. ఈ రచ్చలోనే బాలినేని ఈస్ట్ రాయలసీమ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇప్పుడు విజయసాయి..ఆ రచ్చకు బ్రేకులు వేయాలి. మొదట బావాబామ్మర్దులైన వైవీ, బాలినేనిలని సమన్వయం చేయాలి. ఇక దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. దానికి అడ్డుకట్ట వేయాలి. ఇక్కడ సీటు ఒకరికి ఇస్తే మరొకరు ఓడించేలా ఉన్నారు.

ఇటు కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పై సొంత పార్టీ వాళ్ళే ఫైర్ అవుతున్నారు. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి..ఎమ్మెల్యే టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇటు మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిపై మరో నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాశరెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

ఇక గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి సీనియర్ నేత కారుమూరి వెంకట రమణారెడ్డికి ఏ మాత్రం పడటం లేదు. యర్రగొండపాలెంలో మంత్రి సురేష్‌కు వ్యతిరేక వర్గం ఉంది. ఇలా వైసీపీకి అనుకూలమైన స్థానాల్లో పెద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. వీటిని సాయిరెడ్డి సెట్ చేయగలరో లేదో చూడాలి.