జగన్ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా….!

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును దగ్గరగా పరిశీలించిన వారికే తెలుస్తుందంటారు. ఆయన మాట చెబితే చేసి తీరుతాడనేది ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. నవరత్నాల పేరుతో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్… ఎన్నికైన తొలి ఏడాదిలోనే 98 శాతం హామీలు అమలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనను నమ్మిన వారికి పెద్ద పీట వేసిన జగన్… తనను ఎదిరించిన వారికి కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారనే కారణంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి దగ్గర కట్టిన ప్రజా వేదికను కూల్చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అలాగే తనపై దూషణలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు లాంటి వారిపై వరుస కేసులతో నోరు మూయించారు. ఇక నన్నేం చేయలేరు అంటూ సవాల్ విసిరిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందనే ఆరోపణలతో అరెస్ట్ చేయించారు. పైగా 14 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు చంద్రబాబు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అరెస్ట్ అవుతాడని ఇప్పటికే వైసీపీ నేతలు చెప్పడంతో,… ఆయన ఏకంగా ఢిల్లీ వెళ్లిపోయారు.

జగన్ వ్యవహారశైలి ఇలా ఉంటుందా అని ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నెక్ట్ టార్గెట్ ఏమిటీ అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన జగన్… విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అయితే న్యాయస్థానాల్లో కేసుల కారణంగా ఆ అంశం బ్రేక్ పడింది. అయినా సరే… జగన్ మాత్రం.. అవేవి పట్టించుకున్నట్లు లేదు. దసరా నుంచి తాను విశాఖ నుంచే పరిపాలన చేస్తానని తాజాగా మంత్రివర్గ సమావేశంలో తేల్చేశారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఊహించని దెబ్బ తగిలింది. ఏ మాత్రం బలం లేని టీడీపీ… వైసీపీలోని నలుగురు ఎమ్మెల్యేల సాయంతో తన అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించుకుంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డా.ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్లు అనుమానించిన వైసీపీ నేతలు… వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ఇద్దరు నేతలు సైలెంట్‌గా ఉండగా,… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మాత్రం వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో సైతం వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు వైసీపీ నేతలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో వీరిద్దరే జగన్ టార్గెట్ అనే మాట బలంగా వినిపిస్తోంది.