టీడీపీని నడిపించే నేతలే లేరా…..!?

తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీని ముందుండి నడిపించే నేత కరువయ్యాడా అనే మాట ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిదంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అయితే రిమాండ్ అక్రమం అంటూ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దానిని హైకోర్టు కొట్టేసింది. ఇక 14 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు. తాజాగా ఆయనను సీఐడీ కస్టడీకి కూడా అనుమతించింది కోర్టు. దీంతో తెలుగుదేశం పార్టీకీ, ఆ పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలినట్లైంది.

ఇక ఇదే సమయంలో పార్టీకి భవిష్యత్తు నేతగా మాజీ మంత్రి నారా లోకేశ్‌ను అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక పలు చోట్ల అయితే భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు కూడా వేశారు. అలాంటి నేత కూడా చంద్రబాబు అరెస్టు తర్వాత 5 రోజులకు ఢిల్లీ వెళ్లిపోయారు. పది రోజులుగా అక్కడే ఉంటున్నారు. కనీసం ఏపీలో పరిస్థితుల గురించి ఒక్క మాట కూడా అక్కడ నుంచి మాట్లాడటం లేదు. వెళ్లిన తర్వాత జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేశ్… ఆ తర్వాత నుంచి మాయమైపోయారు. ఫైబర్ నెట్ స్కామ్‌లో ఆయన అరెస్టు ఖాయమనే పుకార్ల నేపథ్యంలో లోకేశ్ సైలెంట్‌గా ఉన్నారనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీలో పార్టీని నడిపించే నేత కరువయ్యాడు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తొలి రోజుల్లో హంగామా చేసిన తెలుగు తమ్ముళ్లు… ఇప్పుడు మాత్రం పూర్తిగా రిలే దీక్ష శిబిరాలకే పరిమితమయ్యారు. ఉదయం వస్తున్నారు… మొక్కుబడిగా కూర్చుంటున్నారు… సాయంత్రం వెళ్లిపోతున్నారు… తప్ప… మరోటి లేదు. అటు పార్టీ కేంద్ర కార్యాలయం సైతం కింది స్థాయి కార్యకర్తలకు సరైన దిశా నిర్దేశం చేయడం లేదనే తెలుస్తోంది. అటు బాబు అరెస్టు, ఇటు లోకేశ్ అందుబాటులో లేకుండా పోవడంతో… పార్టీని ముందుకు నడిపే నేతలు కరువయ్యారు. దీంతో చుక్కాని లేని నావలా ప్రస్తుతం టీడీపీ తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.