బాబుకు దెబ్బ మీద దెబ్బ..ఉండవల్లి ఎంట్రీ అందుకేనా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ రిమాండ్ ముగింపు దశకు వచ్చింది. ఇటు ఏసీబీ కోర్టులో సి‌ఐ‌డి కస్టడీపై వాదనలు పూర్తి కాగా, తీర్పు రావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. అందుకే ఏసీబీ కోర్టు కస్టడీపై తీర్పు వాయిదా వేసింది.

ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడం ఖాయమని, అలాగే సి‌ఐ‌డి కస్టడీకి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని, ముందుగానే వైసీపీ శ్రేణులు కోర్టు తీర్పు ఎలా వస్తుందో చెప్పేస్తున్నారు. అలాగే జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అవి పక్కన పెడితే..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్ళ అల్లర్లు కేసులు మరోవైపు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్‌ బాబు పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు తేలలేదు.

ఇవన్నీ నడుస్తుండగానే ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్ద బాంబ్ పేల్చారు.  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ కేసుపై సమగ్ర దర్యాఫ్తు జరపాలంటూ పిల్ లో కోరారు. ఈ కేసుని సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని కోరిన ఉండవల్లి.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిల్ దాఖలు చేశారు.

కేసుని సీబీఐతో దర్యాఫ్తు చేస్తే అన్ని రకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. హైప్రొఫైల్ వ్యక్తులు ఉన్న ఈ కేసు, సంక్లిష్టంగా ఉన్న ఇలాంటి కేసులను సీబీఐ లోతుగా దర్యాఫ్తు చేస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు, అవినీతి బయటకు పడతాయని ఉండవల్లి అంటున్నారు. మరి ఉండవల్లి వేసిన కేసు ఏం అవుతుందో చూడాలి.