ధర్మాన సోదరుల ఓటమే లక్ష్యంగా టీడీపీ ప్లాన్..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా పొత్తులతో పాటు ప్రజాసంఘాల మద్దతు కూడా ఓ వైపు కూడగడుతోంది. మరోవైపు పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రజాదరణ లేని సీనయర్లను పక్కనబెట్టి యువనేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. యువమంత్రంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ స్థానంలో ఈ సారి విజయభేరీ మోగించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈ సారి అసెంబ్లీ పోరు హోరాహోరీగా జరగనుంది. ప్రముఖ రాజకీయ కుటుంబాలు పోటీకి సిద్ధమవుతుండటంతో కొత్త రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బ్యాలెట్ పోరులో ధర్మాన, కింజరాపు కుటుంబాల వారసులు ప్రత్యర్థులుగా తలపడబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు బగ్గు, ధర్మాన వారసులు రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 20 ఏళ్లుగా ధర్మాన కుటుంబం నరసన్నపేటలో హవా కొనసాగిస్తోంది. ఈసారి ధర్మాన కుటుంబాన్ని ఓడించేందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడుని నరసన్నపేట నుంచి పోటీకి దించబోతున్నట్లు ప్రచారం. ధర్మాన సోదరుల ఓటమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో యాక్షన్ ప్లాన్ అమలు జరుగుతోంది. ఇందుకు నిదర్శనం అక్కడ జరుగుతున్నా రాజకీయ పరిణామాలే.

కింజరాపు ఎర్రన్నాయుడి కుమారుడు అనే గుర్తింపుతో పాటు ఎంపీగా రామ్మెహన్ నాయుడు మంచిపేరు తెచ్చుకున్నారు. పార్లమెంట్ సహా ఇతర వేదికలపై ఆయన ప్రసంగిస్తే విజిల్స్ పడాల్సిందే. సూటిగా, సరళంగా ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు అదనపు బలంగా మారింది. రామ్మోహన్ లీడర్షిప్‌కు యువత నుంచి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నరసన్నపేటలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

పోలాకి మండలంలో కాపులు, నరసన్నపేటలో వైశ్యులు పలు కారణాలతో ధర్మాన కుటుంబానికి దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు కూడా వైసీపీకి మైనస్‌గా మారాయి. ఇదే అదనుగా నియెజకవర్గంలో బలం పెంచుకునేందుకు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 1989 నుంచి ధర్మాన కుటుంబం ఇక్కడ పోటీలో ఉంటుంది. 1999లో కూడా ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. 2004, 2009లో ధర్మాన కృష్ణదాసు గెలిచారు. 2014లో టీడీపీ చేతిలో ఓటమి చెందినా, 2019లో మళ్లీ ఎన్నికయ్యారు.

మాస్ ఇమేజ్‌తో పాటు ఆర్థిక, సామాజిక బలాలను బేరీజు వేసి ఒక్కో నియోజకవర్గ టికెట్‌ను టీడీపీ ఖరారు చేస్తోంది. అవసరమైతే కొత్త, వలస అభ్యర్థులను రంగంలోకి దించే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ వ్యూహాల ముందు టీడీపీ యువమంత్రం ఏ మేరకు నిలుస్తోందో వేచి చూడాలి.