గజపతినగరం టీడీపీలో వర్గపోరు… టికెట్ కోసం సిగపట్లు…!

టీడీపీలో అప్పుడే టికెట్ల పంచాయితీ మొదలైంది. విజయనగరం జిల్లా నేతలు ఎవరికి వారు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. పోటీదారుల బలహీనతలను తమ బలాలుగా మార్చుకుంటూ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు సాధించేందుకు బ్రెయిన్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎవరిని హైకమాండ్ కరుణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో టికెట్ రేస్ ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే కేడర్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు పార్టీ కార్యక్రమాల్లో దూకుడు తగ్గించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక నేతలను విస్మరించారనే విమర్శలు.. అలాగే ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారనే అపప్రద మూటగట్టుకున్నారు. అంతేకాదు.. పార్టీ ఆఫీస్‌ను నియోజకవర్గంలో కాకుండా విజయనగరంలో ఏర్పాటు చేయడంపై కూడా ద్వితీయశ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

అటు అప్పలనాయుడుపై కేడర్‌లోని వ్యతిరేకత కరణం శివరామకృష్ణకు అనుకూలంగా మారింది. మూడు పర్యాయాలు టికెట్ చేజారినా శివరామకృష్ణ టీడీపీలోనే కొనసాగుతుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. పార్టీ పదవులు మినహా ప్రభుత్వ పదవులు దక్కలేదనే సానుభూతితో పాటు… కోవిడ్ సమయంలో చేపట్టిన సహాయ కార్యక్రమాలతో కేడర్‌కు దగ్గరయ్యారు. దీనికి తోడు పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మిస్ కాకుండా పాల్గొంటూ మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కరణానికి టికెట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. కొండపల్లి అప్పలనాయుడు అనుచరులు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ నేతకే వస్తుందని కరణం శివరామకృష్ణకు మళ్లీ నిరాశ తప్పదని కౌంటర్లు వేస్తున్నారు.

అయితే శివరామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు కూడా జరగడం ఆయనకు మరో ప్లస్ పాయింట్. పార్టీలో కరణం గ్రాఫ్‌తో పాటు వర్గ విభేదాలు పెరగడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. వ్యక్తుల మధ్య టికెట్ రేస్ పార్టీకి నష్టం చేస్తుందేమోననే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చివరికి గజపతినగరం నియోజకవర్గం సీటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.