మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌లోని ఓ వర్గం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో బిగెస్ట్ స్టార్‌గా బన్నీ ఎదగడం వెనుక మెగాస్టార్ ఉన్నా… ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదని… తన సొంతగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగాఫ్యాన్స్‌లోని ఒక వర్గం కంప్లయింట్ చేస్తూ ఉంది. అంతేకాదు, సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ కూడా చేశారు.

పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అతనికి ఇండియా వైడ్ ఒక యునీక్ ఐడెంటిటీ వచ్చింది. బన్నీలోని ఈ యునీక్ క్వాలిటీ మెగా అభిమానులకు నచ్చినా మెగాస్టార్ చిరంజీవిని విస్మరించడం ఒక సెక్షన్ ఫ్యాన్స్‌కి రుచించలేదు. అల్లు అర్జున్ తన దివంగత తాతయ్య అల్లు రామలింగయ్య ఫోటోని సోషల్ మీడియాలో మై ఫౌండేషన్ అనే ట్యాగ్ లైన్‌తో అప్ లోడ్ చేయడం మెగా అభిమానుల ఆగ్రహానికి ఒక కారణంగా నిలిచింది. దీన్ని తిరుగుబాటు ధోరణిగా భావిస్తూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఎపిసోడ్ అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. అల్లు అర్జున్ విజయాలకు చిరంజీవి మూలస్తంభం అని మెగా ఫ్యాన్స్.. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఎక్కడా అని బన్నీ ఫ్యాన్స్ మాటల తూటాలు పేల్చుకున్నారు.

ఇక విజయవాడలో జరిగిన మెగా ఫ్యాన్స్ సమావేశంలో అల్లు అర్జున్ లేకుండా చిరంజీవి, పవన్, నాగబాబు, చరణ్ పోస్టర్లు కనిపించాయి. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని బాలకృష్ణ హోస్ట్ చేయడం పై మెగా అభిమానులకు అప్పట్లో మింగుడు పడలేదు. ఈ వైరం శృతి మించడంతో అల్లు అరవింద్ రంగ ప్రవేశం చేశారు. బన్నీ అన్నా అతడి డాన్సులు అన్నా చిరంజీవికి వల్లమాలిన ఇష్టమని, చిరంజీవి గురించి బన్నీ.. ఇంట్లో ఎప్పుడూ చెబుతూనే ఉంటాడని మెగా ఫ్యాన్స్‌ని, బన్నీ ఆర్మీని కూల్ చేసేందుకు అల్లు అరవింద్ తెగ ప్రయత్నించారు.

బన్నీ ఆర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరి పై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంపై స్పందించారు. ప్రొఫెషన్ రీత్యా బన్నీ లేదా తన తమ్ముడు పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగాలని కోరుకుంటానని చిరు చెప్పారు. అంతేకాదు తన కంటే గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశ పడితే అందుకు తాను ఎంతగానో సంతోషిస్తానని మెగాస్టార్ అన్నారు. ఆ స్పిరిట్ అందరిలోనూ ఉండాలని కోరుకుంటానని కూడా అన్నారు. అంతేకాదు, అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రావడం తనకెంతో ఆనందంగా ఉందని కూడా చిరు అన్నారు.

మొత్తానికి, చిరు బ్రాండ్‌తో కాకుండా అల్లు అర్జున్ సొంతగా ఎదగాలనుకుంటున్నారు. ఇందులో తప్పేమి లేదు. ఎంత కాలమని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాలి చెప్పండి. చిరంజీవి సైతం అల్లు అర్జున్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. మరి, ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని అనవసర రాద్ధాంతానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారేమో చూడాలి.