యలమంచిలి రవి… కేరాఫ్ జనసేన… ఫుల్ క్లియర్…!

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపించే నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు కూడా చేరింది. ఇందుకు ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న పరిణామాలే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి అప్పట్లో పోటీ చేసిన బొప్పన భవకుమార్.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండేళ్ల పాటు యాక్టివ్ గానే ఉన్నారు. అయితే గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన దేవినేని అవినాష్… ఆ తర్వాత వైసీపీలో చేరారు. తాజాగా అవినాష్‌కు విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. దీంతో ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.

కొద్ది రోజులుగా పార్టీ పెద్దలపై గుర్రుగా ఉన్న రవి… వైసీపీ నేతలపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వలస నేతల పెత్తనం ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన బాధితులపై దాడులు చేయడం సరికాదంటూ మహిళలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తున్నారు. కార్యకర్తలను కాపాడుకోలేకపోతే నాయకులు విఫలమైనట్లే అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. యలమంచిలి రవి త్వరలోనే పార్టీ మారతారని… వైసీపీకి గుడ్ బై చెప్పి… జనసేన పార్టీలో చేరతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

తాను జనసేనలో చేరే విషయంపై ఇప్పటి వరకు యలమంచిలి రవి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ మార్పు అంటూ వస్తున్న విమర్శలను కూడా రవి ఖండించలేదు. కానీ ఇదే సమయంలో ఈ ఏడాది జనవరి 1వ తేదీన తన కుటుంబంలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న రవి… ఓ కేట్ కట్ చేశారు. తన మనవడితో కలిసి కేక్ కట్ చేసిన యలమంచిలి రవి ఫోటో బెజవాడ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా. తన ముందున్న కేక్‌పైన జనసేన పార్టీ గుర్తు ఉంది. వైసీపీ నేత జనసేన కేక్ కట్ చేయడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే పుకార్లకు మరింత బలాన్నిస్తున్నాయి. ఇదే ఫోటోపై దేవినేని అవినాష్ కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి జనసేన టికెట్ యలమంచిలి రవి తెచ్చుకుంటే… దేవినేని అవినాష్ గెలుపు దాదాపు కష్టమే. ఇప్పటికే యలమంచిలి రవికి చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు కాపు సామాజికవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆత్మీయులున్నారు. మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ టీడీపీకి దక్కుతుందా… లేక జనసేనకు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ జనసేనకు ఛాన్స్ ఇస్తే… సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది.