రూ. కోటి ప్ర‌క‌ట‌న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. ఇదేక్క‌డి గోల రా బాబు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. విజ‌య్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదే సంతోషంలో విజ‌య్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. రీసెంట్ గా వైజాగ్ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో విజ‌య్ మాట్లాడుతూ.. ఖుషి రెమ్యున‌రేష‌న్ లో రూ. కోటి ఫ్యాన్స్ కు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు.

అభిమానుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి రానున్న ప‌ది రోజుల్లో ఒక్కో కుటుంబానికి ల‌క్ష రూపాయ‌ల చెక్‌ను తానే స్వ‌యంగా అందిస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ వేడుక‌లో ప్ర‌క‌టించాడు. అయితే ఈ కోటి రూపాయిల ప్ర‌క‌ట‌నతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఖుషికి ముందు విజ‌య్ వ‌రుస ఫ్లాపుల‌తో బాగా స‌త‌మ‌తం అయ్యాడు. లైగ‌ర్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్‌, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి.

అయితే విజ‌య్ రూ. కోటి ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ ఓ వివాస్ప‌ద ట్వీట్ వ‌దిలింది. `డియ‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి మేము రూ. 8 కోట్లను కోల్పోయాము, కానీ దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు మీ పెద్ద మనసుతో వంద కుటుంబాలకు కోటి రూపాయిలు విరాళం ఇస్తున్నారు. దయచేసి మమ్మల్ని మరియు మా ఎగ్జిబిటర్స్ & డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాము` అంటూ సెటైరిక‌ల్ గా అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది. ఒక సినిమా లాభ‌, న‌ష్టాల గురించి నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ మాట్లాడుకోవాలి. అలాంటిది ఫ్యాన్స్ కోసం ఓ మంచి ప‌నికి శ్రీ‌కారం చుట్టిన హీరో విజ‌య్ పేరును తెర‌పైకి తెస్తూ ఇలా ట్వీట్ చేయ‌డం వివాదానికి దారి తీసింది. నెటిజ‌న్లు అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థపై నిప్పులు చెరుగుతున్నారు. నష్టం వచ్చిందని అడుగుతున్నావ్‌.. లాభం వచ్చుంటే విజయ్‌ని పిలిచి డబ్బు ఇచ్చేవాడివా?, ఫ్యాన్స్‌ కోసం ఏదో సాయం చేస్తుంటే ప్ర‌శంసించాల్సింది పోయి.. ఇలాంటి చెత్త ట్వీట్‌ చేస్తారా..? అంటూ నెటిజ‌న్లు అభిషేక్ పిక్చ‌ర్స్ ను, స‌ద‌రు సంస్థ అధినేతను ఏకేస్తున్నారు.