వంగవీటి రాధా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా….?

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రాధా. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రాధా. ఎన్నికల్లో రాధాకు టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే హామీ కూడా నాలుగేళ్లుగా అమలు కాలేదు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాకే చెందిన పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీ చేశారు చంద్రబాబు. దీంతో రాధా వర్గం పార్టీ అధినేతపైనే విమర్శలు చేస్తోంది. అటు రాధ కూడా కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా రాధ కనిపించడం లేదు కూడా.

తాజాగా తన అనుచరులతో సమావేశం నిర్వహించారు వంగవీటి రాధ. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికీ రాధను ఎక్కడ నుంచి ఎన్నికల్లో నిలుపుతారనే విషయం ఆయన అనుచరులకు క్లారిటీ లేదు. అటు టీడీపీ అధినేత సైతం రాధ విషయాన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. పార్టీ కేంద్ర కార్యాలయానికి, విజయవాడ కార్యాలయానికి కూడా రాధ వచ్చినట్లు కనిపించడం లేదు. ఇక లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కూడా రాధ దూరంగానే ఉన్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి రాధ పోటీ చేస్తారంటూ పుకార్లు వచ్చినప్పటికీ… ఆ తర్వాత మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో రాధకు టికెట్ లేదు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని చెప్పిన సమయంలో కొందరు టీడీపీ నేతలు హడావుడి చేశారు తప్ప… ఆ తర్వాత ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం దిశగా రాధ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాధకు జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పీఏసీ ఛైర్మన్్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే రాధతో భేటీ అయ్యారనే పుకార్లు కూడా బెజవాడ వీధుల్లో వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది రాధ ఆలోచన. అయితే అక్కడ ఇప్పటికే టీడీపీ తరఫున బొండా ఉమా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో రాధకు టికెట్ ఇచ్చే పరిస్థితి టీడీపీకి లేదంటున్నారు విశ్లేషకులు. ఇక టీడీపీ – జనసేన పొత్తు కుదిరితే… పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్ టికెట్ అడగాలని జనసేన భావిస్తోంది. అయితే ఇప్పటికే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ పేరు ప్రచారంలో ఉండగా… సెంట్రల్ కూడా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. దీంతో జనసేనలో చేరితే… ఏ పదవి వస్తుంది.. అసలు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా… లేదా… ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగితేనే మంచిదా అనే విషయాలపై రాధ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాధ రాజకీయ భవిష్యత్తుపై కొద్ది రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.