గోదావరి జిల్లాలపైనే జగన్ గురి..వైసీపీకి ఆధిక్యం?

గోదావరి జిల్లాలు..రాజకీయంగా ఈ జిల్లాల్లో పట్టు సాధించిన పార్టీకి తిరుగుండదు. ఈ జిల్లాల్లో ఆధిక్యం సాధిస్తే అధికారం దక్కించుకోవడం సులువే. ఎందుకంటే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉంటాయి. తూర్పులో 19, పశ్చిమలో 15 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి రావడం సులువే.

2014లో ఈ జిల్లాల్లో టి‌డి‌పి ఆధిక్యం దక్కించుకుంది. 2019లో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. 34 సీట్లకు 27 వైసీపీ, టి‌డి‌పి 6, జనసేన 1 సీటు గెలుచుకుంది. అయితే వైసీపీ అన్నీ సీట్లు గెలవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడం..దాదాపు 15 సీట్లలో టి‌డి‌పి కంటే వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఆ లెక్కన టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే వైసీపీ అన్నీ సీట్లు వచ్చేవి కాదు. అయితే ఈ సారి ఎన్నికల్లో పొత్తు దిశగా టి‌డి‌పి-జనసేన వెళుతున్నాయి. దీంతో వైసీపీ ఆధిక్యం పడిపోయే అవకాశాలు ఉన్నాయి.

పైగా ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇటు టి‌డి‌పి-జనసేన బలపడుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీకి మైనస్. పైగా వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది. అందుకే వీటి అన్నిటికి చెక్ పెట్టి మళ్ళీ గోదావరి జిల్లాల్లో సత్తా చాటేలా జగన్ ఆ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

మొదట నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వైసీపీ బలం పెరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఎన్ని చేసిన టి‌డి‌పి-జనసేన కలిస్తే మాత్రం గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం రావడం కష్టం. విడిగా పోటీ చేస్తే ఆధిక్యం వచ్చే ఛాన్స్ ఉంది.