మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు… మళ్లీ వాళ్లేనా…!

తెలుగుదేశం పార్టీ… 40 వసంతాల వేడుకలను పూర్తి చేసుకుంది. 1982లో ప్రారంభమైన తర్వాత కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఎత్తు పల్లాలను తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓట్ల శాతం ఉన్నప్పటికీ… సీట్లు మాత్రం రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అటు తెలంగాణలో అయితే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేదు.

కానీ రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. అటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా కింది స్థాయి కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక రెండేళ్లు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారనే అపవాదు మూటగట్టుకున్న చంద్రబాబు కూడా ఇప్పుడు మంగళగిరి ఆఫీసులోనే ఉంటున్నారు. ఎన్నికలకు ఇంక 9 నెలలు మాత్రమే సమయం ఉండటంతో నేతలు కూడా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

పార్టీ ఓటమి తర్వాత సీనియర్లు చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అజ్ఞాతంలో ఉండిపోయారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, బొండా ఉమా, దేవినేని ఉమా వంటి నేతలు మినహా… మిగిలిన వారు పెద్దగా కనిపించలేదు. గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా సగం మంది సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో పన్నులు, ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలను పెంచడం, విద్యుత్ కోతలు వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు పేరుతో గ్రామాల్లో కార్యక్రమం నిర్వహిస్తోంది. అలాగే మన ఊరు పేరుతో కూడా గ్రామస్థుల సమస్యలను ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పదవులు అనుభవించి… ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న నేతలు కూడా క్రమంగా బయటకు వస్తున్నారు.

గత ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ వంటి నేతలు ఇప్పుడు మళ్లీ ప్రజల్లో మమేకం అవుతున్నారు. కరోనా సాకుతో సొంత వ్యాపారాలకే పరిమితం అయిన సీనియర్ నేతలంతో… మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల లోపు మళ్లీ చంద్రబాబును కలిసి… యాక్టీవ్ అయ్యేలా సీనియర్లు ప్లాన్ చేస్తున్నారు.