మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కావడం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్… ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అయితే మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇందుకోసం నాలుగేళ్లుగా అదే నియోజకవర్గంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఏ చిన్న ఘటన జరిగినా సరే.. దానిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు.
అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ముందుగా టీడీపీకి నష్టం కలిగిస్తాయని అంతా భావించినప్పటికీ… అవి ఇప్పుడు సైకిల్ పార్టీకి అనుకూలంగా మారేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేవలం 1985లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఏ ఒక్కసారి కూడా గెలవలేదు. 2014 ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత.. ఆ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ముందుగా నియోజకవర్గంలో సీనియర్ నేత మురుగుడు హనుమంతరావు వైసీపీలో చేరారు. ఆయనను జగన్ ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత మరికొందరు నేతలు కూడా ఎమ్మెల్యే ఆర్కే సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత గంజి చిరంజీవి కూడా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అంతా వైసీపీ బలం రెట్టింపు అయ్యిందని భావించారు. కానీ గంజి రాకతో వైసీపీలో సమీకరణాలు మారబోతున్నాయనే గుసగుసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తారని నియోజకవర్గంలో భావించడం లేదు. ఆయన ఈసారి సత్తెనపల్లి లేదా గురజాల నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చేనేత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గానికే చెందిన నేతను బరిలోకి దింపాలని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారు. అదే జరిగితే టికెట్ ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో టికెట్‌ను తన తన కుమార్తె అరుణ కుమారికి ఇవ్వాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో 2009లో విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మంగళగిరి సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ఇక పార్టీలో చేరిన గంజి చిరంజీవి కూడా తాను మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తానని… తానే మంగళగిరి అభ్యర్థిని అంటూ సీఎం క్యాంపు కార్యాలయం బయటే ప్రకటించారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే సైతం ఈసారి ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్‌ను 15 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానంటూ చెబుతున్నారు. దీంతో వైసీపీలో మంగళగిరి టికెట్ కోసం త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అసలే రాజధాని అమరావతి ప్రాంతం, పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివసిస్తున్న నియోజకవర్గం. దీంతో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో ఎక్కువ మంది ఆశావహులు చేరడంతో… అది రాబోయే ఎన్నికల్లో టీడీపీకి లాభం కలిగిస్తుందని తెలుగు తమ్ముళ్లు లోపల్లోపల సంబరపడిపోతున్నారు.