కృష్ణాలో లోకేష్ మూడు రోజులే..స్పెషల్ టార్గెట్ వంశీ.!

లోకేష్ యువగళం పాదయాత్ర అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ప్రజాదరణ ఉంటుంటే..కొన్ని చోట్ల ప్రజాదరణ ఉండటం లేదు. ఇక అలా అలా రాయలసీమ నుంచి కోస్తా వరకు లోకేష్ పాదయాత్ర వచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ అయిదురోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే ఒక్క మంగలగిరిలోనే అయిదు రోజులు పాదయాత్ర చేయనున్న లోకేష్..ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం మూడు రోజుల పాటే యాత్ర చేయనున్నారు. అంటే త్వరగా పాదయాత్ర ముగించేయాలని లోకేష్ చూస్తున్నారు. అందుకే ఇంకా ఎక్కువ రోజులు పాదయాత్ర చేయడానికి లోకేష్‌ సిద్ధంగా లేరు. కానీ కృష్ణాలో కేవలం మూడు రోజులు పాదయాత్ర చేయడంపై అక్కడ తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉన్నారు.

విజయవాడ, గన్నవరం మాత్రమే కవర్ అయ్యేలా పాదయాత్ర ఉంటుంది. 19న విజయవాడలోకి ఎంట్రీ ఇస్తారు. విజయవాడ వెస్ట్, నెక్స్ట్ సెంట్రల్ లో పర్యటిస్తారు. 20న విజయవాడ ఈస్ట్, పెనమలూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 21న గన్నవరంలో పాదయాత్ర ఉంటుంది. అక్కడే భారీ సభ కూడా జరగనుంది.

అయితే టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకునే లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అదే సమయంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సభలోనే టి‌డి‌పిలో చేరనున్నారని తెలుస్తోంది. లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఇదంతా వంశీకి చెక్ పెట్టడం కోసమే. కానీ గన్నవరంలో వంశీకి బలం ఎక్కువ..ఆయనకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు.