కృష్ణాపై సజ్జల గురి..అభ్యర్ధులు ఫిక్స్.!

టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫోకస్ చేశారు. ఇక్కడ మళ్ళీ వైసీపీ హవా నడిచేలా స్కెచ్ వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పిని చిత్తు చేసి 16 సీట్లకు వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కృష్ణాలో టి‌డి‌పికి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో మళ్ళీ బలమైన అభ్యర్ధులని బరిలో దింపడానికి కృషి చేస్తున్నారు.

ఇక కృష్ణాపై సజ్జల స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఇటీవలే విజయవాడ వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సజ్జల..విజయవాడలో ముగ్గురు అభ్యర్ధులని డిక్లేర్ చేశారు. విజయవాడ ఈస్ట్ లో దేవినేని అవినాష్, సెంట్రల్ లో మల్లాది విష్ణు, వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావులని ఫిక్స్ చేశారు. ఇక జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు 90 శాతం అభ్యర్ధులు రెడీ అయిపోయారు. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, పెనమలూరులో పార్థసారథి, పామర్రులో కైలే అనిల్ కుమార్ పోటీ చేయనున్నారు.

ఇటు నందిగామలో జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, తిరువూరులో రక్షణనిధి, నూజివీడులో మేకా ప్రతాప్ పోటీ చేయనున్నారు. ఇక కైకలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? లేదా?అనేది క్లారిటీ లేదు. ఇటు పెడనలో జోగి రమేష్, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సీట్లలో మార్పులు ఏమైనా ఉంటాయేమో చూడాలి.

ఇక మచిలీపట్నంలో పేర్ని నాని బదులు..ఆయన తనయుడు కృష్ణమూర్తి పోటీ చేయనున్నారు. ఇటు అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబుకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వవచ్చు.