ఎన్నికల ఎత్తులు..అభ్యర్ధులతో చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకునే దిశగా సి‌ఎం కే‌సి‌ఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి తెలంగాణలో అధికారం దక్కించుకున్న బి‌ఆర్‌ఎస్..మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు.  తాజాగా సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన..అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు.

బి‌ఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు చేసిన కార్యక్రమాలు గురించి మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా కొందరు వచ్చి అవి చేస్తాం..ఇవి చేస్తామంటే నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. ఇక 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ200 పెన్షన్ మాత్రమే వచ్చిందని, తాము వచ్చి వెయ్యి చేశామని, తర్వాత రూ.2016 చేశామని..ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేలు ఇస్తామని అంటుందని..మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ 4 వేలు అంటే..తాను 5 వేలు చెప్పలేనా? అంటూ కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్‌ వస్తే పైరవీకారులదే రాజ్యమవుతుందని, ధరణిని రైతుల బాగు కోసం తెచ్చామని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల మొదట లిస్టు విడుదల చేయడానికి కే‌సి‌ఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్ధులని ఖరారు చేసిన కే‌సి‌ఆర్..ఎంతమందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారు..ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఎవరికి వారు సీటు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. మరి సీటు దక్కని వారు ఎలాంటి రచ్చ చేస్తారు..బి‌ఆర్‌ఎస్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూడాలి.