ఆ రెండు పార్టీలకు ఫుల్ పబ్లిసిటీ… మరి తమ్ముళ్ల పరిస్థితి….!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే బ్రో సినిమా. వాస్తవానికి ఆ సినిమాలో కేవలం ఓ రెండు నిమిషాల సేపు మాత్రమే పృద్వీరాజ్ క్యారెక్టర్. అది కూడా ఓ పాటలో భాగం. అక్కడ పృద్వీ వేసే డ్యాన్స్…. ఆ సీన్‌లో పవన్ చెప్పే డైలాగ్‌ ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. పృద్వీ వేసిన స్టెప్పులు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ అంబటి రాంబాబు వేసినట్లుగా ఉందని అంతా పోల్చారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది ఒక రకంగా బ్రో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ కూడా. తనను వ్యగ్యంగా చూపించారని బ్రో సినిమా నిర్మాతలపైన, హీరో పవన్ కల్యాణ్‌పైన మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను హీరోగా పెట్టి తీయాల్సింది బ్రో కాదని… పెళ్లాలు – విడాకులు, ఎంఆర్ఓ అనే సినిమాలని అంబటి వెల్లడించారు. అసలు బ్రో సినిమా పెట్టుబడులు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తానంటూ అంబటి తెలిపారు.

ఇక మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జనసేన పార్టీ నేతలు కూడా ఘాటుగానే బదులిచ్చారు. అంబటి రాంబాబు మీద SSS సందులో సంబరాల శాంబాబు అనే సినిమా తీస్తున్నామంటూ తిరుపతి జనసేన నాయకులు ముహుర్తం షాట్, టైటిల్ షూట్ చేశారు. తమ నాయకుడి జోలికి వస్తే… బయోపిక్, వెబ్ సిరీస్ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని… కూడా వెల్లడించారు. ఇక పార్టీ నేత పోతిన మహేశ్ కూడా రాంబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాంబాబు హీరోగా అద్దె గదిలో అరగంట అనే టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఇక సీఎం జగన్‌పైన కూడా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు మహేష్ వెల్లడించారు.

మొత్తానికి బ్రో సినిమా వల్ల అటు జనసేనపైన మంత్రి అంబటి వ్యాఖ్యలు… వాటికి జనసేన పార్టీ నేతల కౌంటర్లతో వైసీపీ, జనసేన పార్టీలకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ గురించి మాత్రం మీడియా అసలు పట్టించుకుంటున్నట్లు లేదు. లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టు బాట వార్తలను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ వ్యూవర్ షిప్ ఉన్న వార్తలుగా జనసేన, వైసీపీ వార్ నిలవగా… యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టు బాటకు ఆశించినంత పబ్లిసిటీ రావడం లేదు. దీంతో మీడియా మేనేజ్‌మెంట్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే టీడీపీకి మాత్రం ఊహించని షాక్ తగిలినట్లైంది. పాదయాత్రను కూడా న్యూస్ ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇవ్వటం లేదు. ఇక చంద్రబాబు ప్రాజెక్టు బాట సైతం లైట్ తీసుకున్నాయి. ఏదైనా గొడవ జరిగితే తప్ప… టీడీపీ వైపు మీడియా కన్నెత్తి కూడా చూడటం లేదు.