తూర్పు వైసీపీలో పోరు..జగన్ సెట్ చేసేస్తారా?

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోరు వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఓ వైపు జగన్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు ఏమో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది.

ఈ క్రమంలో జగన్ జిల్లా పర్యటనకు వచ్చి..ఈ రచ్చకు బ్రేకులు వేయనున్నారు. మొదట పోలవరం పర్యటించి..అక్కడ ముంపు బాధితులని పరామర్శించి..నెక్స్ట్ రాజమండ్రికి వచ్చి అక్కడే బస చేసి…ఆధిపత్య పోరుకు దిగుతున్న నేతలని సెట్ చేయనున్నారు. అయితే తూర్పులో మొదట రామచంద్రాపురం రచ్చ పై ఫోకస్ పెడతారు. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ల మధ్య సీటు గొడవ నడుస్తుంది. దీంతో అక్కడ ఇరు వర్గాలకు సర్ది చెప్పి సీటు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

నెక్స్ట్ జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎంపీ తోట నరసింహంలకు పడటం లేదు. ఇద్దరి మధ్య సీటు పంచాయితీ ఉంది. ఇటు అమలాపురంలో ఎంపీ చింతా అనురాధ, మంత్రి పినిపే విశ్వరూప్‌లకు పొసగడం లేదు. అటు ప్రత్తిపాడు ఎమ్మెల్యేపై ద్వితీయ శ్రేణి నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు.

ఇటు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పుదుచ్చేరి మాజీ మంత్రి, టి‌టి‌డి బోర్డు సభ్యుడు మల్లాడి కృష్ణరావు మధ్య విభేదాలు ఉన్నాయి. మల్లాడికి కాకినాడపై గట్టి పట్టు ఉంది. పైగా బీసీ వర్గానికి చెందిన నేత. అయితే మల్లాడి, ద్వారంపూడి వర్గాల మధ్య విభేదాలు తారస్థాయిలో నడుస్తున్నాయి. ఇలా ఎక్కడకక్కడ తూర్పు వైసీపీలో రచ్చ నడుస్తుంది. అందుకే అక్కడే ఉండే ఈ పంచాయితీలకు జగన్ చెక్ పెట్టనున్నారు.