టీ.కాంగ్రెస్‌పై డీకే ఫోకస్..కేసీఆర్‌కు ధీటుగా.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధిష్టానం గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటి అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ ముఖ్యం..అందుకే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయం సాధించడం కూడా అంతే ముఖ్యమన్నట్లు పనిచేస్తుంది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

సెమీ ఫైనల్స్ మాదిరిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..అక్కడ రెండుసార్లు అధికారానికి దూరమైంది. కానీ ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే దిశగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిటీలని ఏర్పాటు చేసి దూకుడుగా వెళుతున్నారు. అలాగే అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ సారి తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ చూస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రియాంక గాంధీ, కర్నాటక డిప్యూటీ సి‌ఎం డి‌కే శివకుమార్‌లకు అప్పగించారు.

అయితే ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ చూసుకుంటారు..ఇక వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపిక, ఆర్ధిక అంశాల విషయాలని డి‌కే చూసుకుంటారని తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో ఆన్ని తానై డి‌కే చూసుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు తెలంగాణలో అదే మాదిరిగా పార్టీని గెలిపించాలని చూస్తున్నారు.

ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక విషయంలో టి.కాంగ్రెస్ నేతలకు డి‌కే కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. సునీల్ కానుగోలు సర్వే ప్రకారం దాదాపు 35 స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేరని తేలింది. అలాంటి సీట్లలో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులని లాగాలని చూస్తున్నారు. పొంగులేటి, జూపల్లి మినహా కాంగ్రెస్ లో బలమైన నేతలు రాలేదు. కాబట్టి బలమైన నేతలని తీసుకోవాల్సి ఉంది. మొత్తానికైతే డి‌కే తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేయనున్నారు.