ఈసారి అయినా.. సొంత జిల్లాలో చక్రం తిప్పుతారా….!?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలనేది మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్. అందుకోసం దాదాపు రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ఏడాది ముందే అధికారంలో వస్తే అమలు చేసే పథకాల జాబితాను రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ నేతలకు ఇప్పటి నుంచి దిశా నిర్దేశం చేసి… ఎవరైనా అలక్ష్యంగా వ్యవహరిస్తే… వేటు తప్పదని కూడా బాబు హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా కొన్ని జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆ జిల్లాల్లో ఎక్కువ సీట్లు రాబట్టాలనే గట్టి పట్టుదలతో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి ఏకపక్ష మెజారిటీ వచ్చిందే లేదు. వైఎస్ కుటుంబం సొంత జిల్లాలో గత ఎన్నికల్లో పదికి పది వైసీపీ గెలుచుకుంది. అలాగే 2004, 2009 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి 9 చొప్పున సీట్లు వచ్చాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఆశించినన్ని సీట్లు రాలేదు. దీంతో విపక్షాలు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నాయి కూడా. 2019 ఎన్నికల్లో కేవలం కుప్పం నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా చంద్రబాబు పోటీ చేయడం వల్ల మాత్రమే. అంతే తప్ప మిగిలిన చోట్ల పార్టీ ఓడింది. బాబుకు సొంత జిల్లాలోనే వ్యతిరేకత ఉంది అనేలా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు బాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ పర్యటిస్తున్నారు బాబు. అలాగే కుప్పం నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. ఇక జనవరి 27న పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచే ప్రారంభించారు. అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. చిత్తూరులోనే పాదయాత్ర ఎక్కువ రోజులు సాగింది. ఇక బాబు సైతం నెలలో రెండు రోజులు కుప్పం నియోజకవర్గంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం సమాచారం తెప్పించుకుంటున్న చంద్రబాబు… ఇప్పటికే అభ్యర్థుల నియామకం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ… రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.