ఆ రెండు జిల్లాలేనా పవన్ టార్గెట్…!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్. అందుకే దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీపై మాటల తూటాలు ఎక్కుపెట్టిన పవన్… అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా క్రమంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభకు పెద్ద ఎత్తు అభిమానులు వస్తున్నప్పటికీ… వారంతా ఓటర్లు మారడంలో విఫలమవుతున్నారు. దీంతో ఈ సారి మాత్రం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. గతంలో మాదిరి ఆవేశ పూరిత ప్రసంగాలకు బదులుగా… ఓటర్లను ఆకట్టుకునేలా జనసేనాని మాట్లాడుతున్నాడని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో తమకు పట్టున్న జిల్లాలపైనే పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కడ పోయిందో… అక్కడే వెతుక్కోవాలి అనే సూత్రాన్ని పవన్ బాగా పాటిస్తున్నారు.

జనసేన పార్టీకి తొలి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టి పట్టు ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలోనే జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ కూడా రెండో స్థానంలో నిలిచారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా జనసేన పార్టీ అభ్యర్థులే కారణం. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఓట్లను చీల్చింది జనసేన పార్టీ నేతలే. దీంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఫోకస్ పెట్టారు.

2019లో ఘోరంగా ఓడినప్పటి నుంచి పవన్ ఉభయ గోదావరి జిల్లాలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏ చిన్న కార్యక్రమమైనా సరే.. గోదావరి జిల్లాల నుంచే ప్రారంభిస్తున్నారు పవన్. చివరికి వారాహి యాత్ర సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని ముందుగా ప్రకటించినప్పటికీ… ఇప్పటి వరకు కేవలం గోదావరి జిల్లాల్లోనే నిర్వహించారు. అలాగే రాబోయే రోజుల్లో మళ్లీ మళ్లీ వస్తానంటూ తమ పార్టీ నేతలకు పవన్ చెప్పడం చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలే జనసేన టార్గెట్ అన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు పివన్ పోటీ చేసేది ఇక్కడే అంటూ సోషల్ మీడియాలో పలు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. పిఠాపురం, కాకినాడ సిటీ అంటున్నప్పటికీ… పవన్ మాత్రం భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమంటున్నారు. ఇక కాకినాడ సభలో సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదంటూ జనసైనికులకు పవన్ టార్గెట్ పెట్టారు. దీంతో పవన్ ప్రత్యేకంగా ఆ రెండు జిల్లాల పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.