మళ్లీ ఆ ముగ్గురు కలుస్తారా… కాంబో సాధ్యం అవుతుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 కాంబినేషన్‌ రిపిట్ కానుందా… ఏపీలో తిరిగి 2014 నాటి మిత్రపక్షం అధికారంలోకి వస్తుందా… అంటే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగనప్పటికీ… టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి 106 సీట్లు గెలుచుకోగా… వైసీపీ 67 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ-బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు కొనసాగింది. అయితే ప్రత్యేక హోదా అంశంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపులో అలసత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ విబేధించింది. దాంతో… నాలుగేళ్ల తర్వాత టీడీపీ – బీజేపీ ప్రభుత్వం విడిపోయింది. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ కూడా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేపట్టారు. చివరికి టీడీపీ, బీజేపీలకు దూరంగా జరిగిన జనసేనాని… 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. అయితే రాజోలు నియోజకవర్గం మినహా… మరెక్కడా జనసేన పార్టీ గెలవలేదు.

అటు 2014 ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ… 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా కమలం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదు. దీంతో కలిసి ఉంటే కలదు సుఖం అనే పాట అందుకున్నాయి మూడు పార్టీలు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కంటే కూడా… ఉమ్మడిగా పోటీ చేయడం వల్లే లాభం వస్తుందని భావించినట్లుగా తెలుస్తోంది. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కార్‌కు వైసీపీ మద్దతు ఇస్తూనే ఉంది. అడపాదడపా విమర్శలు చేస్తున్నప్పటికీ… అవన్నీ కేవలం కంటితుడుపు చర్యలుగానే అభివర్ణించారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో విమర్శలు చేస్తున్నప్పటికీ… జగన్ తన ఢిల్లీ పర్యటనలతో కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకున్నారు. వారికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు… కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలపడంతో.. నాలుగేళ్ల పాటు వైసీపీ-బీజేపీ ఒకటే అనే మాట వినిపించింది. పైగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి ఏపీ బీజేపీలోని నలుగురు నేతలు మద్దతు తెలిపారు.

బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు తప్ప… జగన్‌ను పల్లెత్తు మాట కూడా అనలేదు. దీంతో.. వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ అండదండలున్నాయనే మాట బలంగా వినిపించింది. అటు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్టుకు బ్రేకులు పడటం వెనుక కూడా బీజేపీ పెద్దల హస్తం ఉందనే పుకార్లు వినిపించాయి. అయితే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసిన తర్వాత బీజేపీ నేతల మాట తీరులో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అండ వైసీపీకి ఉండకపోవచ్చు అని ఏకంగా సీఎం జగన్ బహిరంగ సభలోనే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో మాదిరిగా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే… టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో 2014 కాంబో రిపీట్‌ అవుతుందా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.