ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?… 30 మంది సిటింగ్‌లకు చెడ్డ పేరు… కేసీఆర్‌ చేయించుకున్న సర్వేల్లో 30 మంది సిటింగ్గులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను బట్టి చూస్తే… ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం.

ఆయనొక మంత్రి.. ఎప్పుడూ కేసీఆర్‌ వెంట పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సీఎం పక్కనే ఉండే ఆయన పట్ల అనూహ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆయన నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం పార్టీ అధినేత చేయించుకున్న తాజా సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. సదరు మంత్రికి టికెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్న సంశయంలో గులాబీ బాస్‌ మల్లగుల్లాలు పడుతున్నారు. అదేవిధంగా, పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు.. తాను కేసీఆర్‌కు సన్నిహితుడినని చెప్పుకొంటారు. ఆయన సీఎంకు, ప్రగతి భవన్‌కు దగ్గరేమో కానీ.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తన నియోజకవర్గంలోని ప్రజలకు మాత్రం చాలా దూరంగా ఉన్నారని మాత్రం తెలుస్తోంది.

ఇక తాజాగా బీఆర్‌ఎస్‌ చేయించిన సర్వేల్లోనూ ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బయటపడింది. ఈ సారి ఏం చేయాలనే విషయమై కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొన్ని రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందనే అంచనాకు వచ్చారు. అక్కడి ప్రజాప్రతినిధుల పనితీరు, వారి వ్యవహార శైలిపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం కేసీఆర్‌ దృష్టికి వచ్చినట్లు సమాచారం. గులాబీ బాస్‌ జరిపించిన సర్వేల్లో.. ఈ నలుగురైదుగురే కాదు… 30 మందికి పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలినట్లు తెలిసింది. తాజా సర్వేల ద్వారా చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, దళితబంధు లాంటి పథకాల్లో అమ్యామ్యాల ఆరోపణలతోపాటు తమ గోడు పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అధినేత చేయించుకున్న సర్వేల్లో 30 మంది సిటింగులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన 15 మందిలోనూ సగం మంది ఎమ్మెల్యేల పట్ల జనం వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను చూస్తే… ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తప్పించాలా? అభ్యర్థులను మారిస్తే అక్కడ గెలుపు సాధ్యమా? అన్న దానిపై బీఆర్‌ఎస్‌ అధినేత మల్లగుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఓటమి చవిచూడక తప్పదని, వారి ఓటమి పార్టీకి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయంతోపాటు.. తాజా సర్వేలో వెల్లడైన అంశాలు గులాబీ బాస్‌ను ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కేసీఆర్‌ చేపట్టిన సర్వేల వివరాలు జనంలోకి లీక్‌ కావడమే కాకుండా.. సామాన్యులు సైతం ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సదరు ఎమ్మెల్యేలు ఈసారి ఓటమి పాలవుతారని కేసీఆర్‌ భావిస్తుండగా, వారికి టికెట్‌ ఇవ్వరంటూ ప్రజల్లోనూ వారి పేర్లు నానుతుండటం విశేషం. ఇది కేవలం వ్యక్తుల మధ్యనే కాకుండా.. సోషల్‌ మీడియా వేదికగా.. విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఓటమి ఖాయమని చెబుతున్న జనం.. పార్టీ అభ్యర్థిని మారిస్తే ఏం చేస్తారన్న దానిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేయకపోవడంతో.. అధికార పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.