గన్నవరం పాలిట్రిక్స్… టీడీపీ లిస్ట్ పెద్దదే..!

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… అనూహ్యంగా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గానికి తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో సీపీఐ తరఫున గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య… తర్వాత 1962లో రెండోసారి ఎన్నికలో కూడా విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ 2014, 19 ఎన్నికల్లో మాత్రమే ఓ అభ్యర్థి వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదా అనే ప్రశ్న ఇప్పటి నుంచే జోరుగా వినిపిస్తోంది. అసలు ఎవరు పోటీ చేస్తారనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్.

వాస్తవానికి 2014 ఎన్నికల్లో 15 వేల ఓట్ల మెజారిటీ సాధించిన వంశీ… 2019 ఎన్నికల్లో మాత్రం కేవలం 8 వందల ఓట్ల తేడాతోనే గెలిచారు. అప్పటి వరకు పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయిన యార్లగడ్డ వెంకట్రావు… చివరి నిమిషంలో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి నుంచి గట్టి పోటీ ఇచ్చిన వెంకట్రావు… నేతల మధ్య విభేదాల కారణంగానే ఓడినట్లు తర్వాత పార్టీకి నివేదిక చేరింది. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున వల్లభనేని వంశీ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వంశీని పార్టీలో చేర్చుకోవడంపై యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కూడా. అలాగే వంశీని ఓడించేందుకు తాను పని చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు.

దీంతో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పుడు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి గన్నవరం నుంచి పోటీ చేసే వారి జాబితాలో తారక రత్న పేరు బలంగా వినిపించింది. కానీ ఆయన మరణం తర్వాత ఎవరు వస్తారనేది ఇప్పటికీ తేలలేదు. నియోజకవర్గం ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడు గుండె పోటుతో మృతి చెందారు. ఆయన స్థానంలో కొనకళ్ల నారాయణకు బాధ్యతలు అప్పగించినప్పటికీ… టికెట్ మాత్రం కొత్తవారికే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దేవినేని కుటుంబానికి చెందిన ఓ మహిళ కూడా గన్నవరం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే తాజాగా ఓ వ్యాపారవేత్త కుటుంబం కూడా గన్నవరం టికెట్ కోసం ఇప్పటికే చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.