లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… తర్వాత నుంచి పాదయాత్రకు పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి రెస్పాన్స్ బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నేతలు పోటీ పడి మరీ పాదయాత్రను సక్సెస్ చేశారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న యాత్రకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు కూడా. అయితే లోకేశ్ పాదయాత్రకు ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనేది ఇప్పుడు సర్వాత్రా వినిపిస్తున్న మాట.

లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత… చాలా అడ్డంకులు వచ్చాయనేది వాస్తవం. తొలి రోజే హీరో నందమూరి తారక రత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో మీడియా ఫోకస్ మొత్తం అటు వైపు తిరిగింది. ఆ తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత తారకరత్న బెంగళూరులో మృతి చెందారు. దీంతో పాదయాత్రకు బ్రేక్ పడింది కూడా. అదే సమయంలో 3 రోజుల పాటు మీడియా ఫుల్ కవరేజ్ తారక రత్న, గుండెపోటు, కుటుంబ పరిస్థితులపై మళ్లింది. పాదయాత్ర సాగుతున్న సమయంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ వారాహి యాత్ర ప్రారంభించారు. దీనిపై తొలి నుంచి మాటల యుద్ధం జరుగుతుండటంతో… నిత్యం పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే మీడియా కవరేజ్ చేసింది తప్ప… లోకేశ్ పాదయాత్రను పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇక బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించిన సమయంలో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు కాన్వాయ్‌ పైకి రాళ్లు విసిరారు. దీంతో దాదాపు పది రోజుల పాటు ఎక్కడ చూసినా ఇదే రచ్చ.

ఆ తర్వాత మహానాడుతో మీడియా ఫోకస్ అటు వైపు తిరిగింది. తర్వాత మళ్లీ వారాహి యాత్ర. అన్నవరంలో మొదలైన తొలి విడత యాత్ర… భీమవరం వరకు సాగింది. ఈ యాత్రలో పవన్ కొందరు నేతలను టార్గెట్ చేశారు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ చేసిన ఆరోపణలు… అందుకు ద్వారంపూడి ఇచ్చిన కౌంటర్లతో… నాలుగు రోజుల పాటు ఫుల్ ఫోకస్ అటే ఉండిపోయింది. ఇక రెండో విడత వారాహి యాత్రలో ఏలూరులో వలంటీర్ వ్యవస్థపైన పవన్ ఆరోపణలు చేశారు. దీంతో వలంటీర్ వర్సస్ పవన్‌గా పరిస్థితి మారింది. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ వ్యాఖ్యలకు సపోర్ట్ పలకడంతో… లోకేశ్ పాదయాత్రను మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రాజెక్టుల బాట పేరుతో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ యాత్రలో పులివెందుల నుంచి మీడియా ఫోకస్ మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపైనే ఉందనేది వాస్తవం. వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితి మారిపోయింది. దాడులు, ప్రతిదాడులు, పోలీసులు ఆంక్షలు, కేసులు, చంద్రబాబు వార్నింగ్, వైసీపీ నేతల కౌంటర్లతో మీడియా కవరేజ్ మొత్తం అటు వైపే ఉంది తప్ప… లోకేశ్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో లోకేశ్‌కు చంద్రబాబు అడ్డుగా మారాడనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.