ఏపీ అప్పులపై కేంద్రం అలా..పురందేశ్వరి ఇలా..ఏది నిజం.!

ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని, ఈ నాలుగేళ్లలో దాదాపు ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయని చెప్పి  టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పిలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక సుమారు లక్ష కోట్ల వరకు అప్పులు ఉంటే..చంద్రబాబు హయాంలో  2 లక్షల కోట్లపైనే అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఇక జగన్ వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు వస్తున్నాయి.

కానీ కేంద్రం మాత్రం 2 లక్షల కోట్లు లోపే ఈ నాలుగేళ్లలో అప్పులు చేశారని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. నాలుగేళ్లలో జగన్ సర్కార్ చేసిన అప్పు కేవలం 1.77 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే పురందేశ్వరి మాత్రం మళ్ళీ నిర్మలా చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. నిర్మలా సీతారామన్‌ రిజర్వ్ బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం చెప్పారని వివరించారు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో ఉన్న అప్పుల గురించే చెప్పారని,పరిధి దాటి..ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, మద్యం ఆదాయం చూపి తెచ్చిన అప్పులు చాలా ఉన్నాయన్నారు.

ఇంకా రకరకలుగా ఇతర వనరుల ద్వారా అప్పులు చేశారని. మొత్తం మీద ఏపీపై రూ.10.77 లక్షల కోట్లు అప్పుల భారం ఉందని తాను చెప్పానని,  ఇందులో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లు అని తెలిపారు. అయితే కేంద్రం ఒక లెక్క చెబుతుంటే..పురందేశ్వరి ఈ లెక్క చెబుతున్నారు. అయితే ఇందులో ఎవరి లెక్క కరెక్ట్ అనేది అర్ధం కాకుండా ఉంది.

ఒకవేళ పరిధి దాటి అప్పులు చేస్తే కేంద్రం వద్ద లెక్కలు లేవా? ఉన్నా? లేనట్లుగా చెబుతుందా? అంటే సమాధానం బి‌జే‌పి వాళ్ళే చెప్పాలి. ఒకవేళ అనేక రకాలుగా అప్పులు చేస్తే ఆ లెక్కలని బయటపెట్టాలి కదా..అవేం లేవు. కాబట్టి ప్రతిపక్షాల వాదనలో నిజం లేదని తెలుస్తోంది.