అనిరుద్ధే టాప్…మరీ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సినిమా ఎలా ఉన్న సరే అనిరుద్ మ్యూజిక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా రజినీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కించిన చిత్రం జైలర్. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలయ్యి వారం రోజులు కావస్తున్నా ఇంకా జోరు తగ్గలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలలో మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ చాలా ప్లస్ అని చెప్పాలి. పాటలు పెద్దగా లేకపోయినా సినిమాలో బాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ, రజినీకాంత్ క్యారక్టర్ ని ఎలివేట్ చెయ్యడంలో అనిరుద్ మ్యూజిక్ చాలా ఉపయోగపడింది. రజినీకాంత్ మాత్రమే కాకుండా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ కూడా ఉన్నారు. వీళ్లందరి ఇంట్రోలకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ జనాలకు థియేటర్స్ లో పిచ్చెక్కిస్తోంది.

“వై థిస్ కొలవరి” అంటూ ధనుష్ నటించిన “త్రీ” చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ 32 ఏళ్ళ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్…ప్రస్తుతం తన కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన “విక్రమ్” చిత్రానికి అనిరుద్ అందించిన మ్యూజిక్, బాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా జనాల చెవులలో మారుమోగుతూనే ఉంది. ప్రస్తుతం అనిరుద్ అట్లీ, షా రుఖ్ ఖాన్ కాంబోలో వస్తున్నా “జవాన్”, ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్నా “దేవర”, లోకేష్, విజయ్ కాంబోలో వస్తున్నా “లియో”, వంటి ప్రెస్టీజియస్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా అనిరుద్ రెమ్యూనిరేషన్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనిరుద్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా సినిమాకు 8 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడని సమాచారం. అడిగినంత మొత్తం ఇచ్చిన సరే అనిరుద్ డేట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారట చాలామంది డైరెక్టర్స్. ఆలా ఉంది మరి అనిరుద్ క్రేజ్.