విశాఖ వైసీపీలో ట్విస్ట్‌లు..సీటుతో అధ్యక్షుడు.!

ఎప్పుడైతే విశాఖని పరిపాలన రాజధాని అని చెప్పారో..అప్పటినుంచే విశాఖలో రాజకీయంగా వైసీపీకి కలిసిరావడం లేదు. రాజధాని పేరుతో అక్కడ వైసీపీ అన్నీ అక్రమాలకే పాల్పడుతుందనే విమర్శలు వచ్చాయి. ఇక అక్కడి ప్రజలు వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారు. జగన్ విశాఖలో కాపురం పెడతానని అంటున్న అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో టి‌డి‌పి బలపడటం..జనసేనతో పొత్తు ఇంకా ప్లస్ అవ్వడంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం..నెక్స్ట్ సీటు లేకపోవడం..అలాగే గెలవదనే డౌట్ ఉండటంతో పంచకర్ల వైసీపీకి రాజీనామా చేసి..జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. పంచకర్ల రాజీనామాతో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఈ పదవిని వేరొకరికి ఇవ్వడానికి వైవీ సుబ్బారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏ నేత కూడా పదవి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. పైగా ఏదైనా సీటు హామీ ఇస్తేనే పదవి తీసుకుంటామని అంటున్నారు.

పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్‌ను సుబ్బారెడ్డి కోరగా తాను ఎనిమిదేళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశానని, ఇప్పుడు తనకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది.  తర్వాత మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు సమాచారం. కానీ తనకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని హామీ ఇస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటానని షరతు పెట్టినట్టు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డిలు సైతం ఆసక్తిగా లేరని తెలిసింది. జీవీఎంసీ కో-ఆప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావు, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీలు మాత్రం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారట. మరి వీరిలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.