టీడీపీలో అనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే పార్టీలో మాత్రం సీనియర్ జూనియర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలకు… కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలే అసలైన నేతలని గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా మారిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జెండా మోసిన వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి చంద్రబాబు పదవులిచ్చారని పలువురు సీనియర్లు అధినేతపై గుర్రుగా ఉన్నారు కూడా. ఇప్పుడు ఇదే అంశంపై పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొందరు నేతలు పార్టీకి అండగా ఉన్నారు. అయితే వీరంతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తప్పకుండా పదవులు వస్తాయని చాలా మంది ఆశపడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇచ్చారు తప్ప… సీనియర్లను పట్టించుకోలేదు. దీంతో వారంతా పార్టీలో జూనియర్ల వల్ల పడుతున్న ఇబ్బందులను అటు అధినేతకు చెప్పుకోలేక… ఇటు పార్టీలో ఉండలేక తికమకపడుతున్నారు.

2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితను ఏకంగా తెలుగు మహిళ అధ్యక్షురాలిని చేశారు చంద్రబాబు. ఇలా చేయడం వల్ల పార్టీలో తొలి నుంచి ఉంటున్న పలువురు మహిళా నేతలు కాస్త గుర్రుగా ఉన్నారు. సీనియర్ నేతలను కాదని… అనితకు ఇవ్వడం వల్ల పార్టీకి మంచి కంటే… చెడు ఎక్కువగా జరిగిందనేది పార్టీ నేతల మాట. ఒక్కసారి ఎమ్మెల్యేగా అనితకు రాష్ట్ర బాధ్యతలు ఎలా అప్పగిస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎస్సీ మహిళా నేతలు ఎంతో మంది ఉనప్పటికీ అనితకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటనేది సీనియర్ల మాట. పార్టీలో ఇతర నేతలను అనిత కలుపుకుని పోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఇదే విషయాన్ని ఇప్పటికే అధినేత దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఆయన ఎన్నికలపైనే ఫోకస్ పెట్టడంతో.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనేది సీనియర్ల ఆరోపణ. దీంతో పార్టీలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనేది సీనయర్ల వాదన. రాబోయే ఎన్నికల్లో అనితకు టికెట్ రాకుండా చేసేందుకు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు 2019లో కొవ్వూరులో పోటీ చేసి అనిత ఓడిన విషయాన్ని హైలైట్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.