తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీనే.. కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్

ప్రస్తుతం తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. ఆ వాన నీటితో రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. అందువలన తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ మహానగరంలో వరద నీటి కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌ అవుతుంది.

తాజాగా ఈ పరిస్థితులన్నిటిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ఐకియా ఏరియాలోని విజువల్స్ ని షేర్ చేస్తూ ‘ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి. ఒక నాలుగు నెలలు ఓపిక పట్టండి, మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం లోకి వస్తుంది. అప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం. అలానే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుంది’ అంటూ రాసుకొచ్చారు బండ్ల. ఆ పోస్టు చూసిన తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు.

కొందరేమో ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వారు చేసింది చాలదా నాయనా, మళ్ళీ మీరు వచ్చి ఏం చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తుంటే… మరికొందరేమో నీకు అసలు రాజకీయాలు అవసరమా, వెళ్లి సినిమాలు చేసుకోరాదు అని వ్యాంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమందేమో 15 నుండి 20 సంవత్సరాల క్రితం చేసిన కామెడీ గుర్తు వస్తుంది అంటూ ఎటకారం చేస్తున్నారు. అలా కొంతమంది బండ్ల గణేష్ ట్విట్ పై విమర్శలు కురిపిస్తుంటే మరికొంతమందేమో అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.