ఇలా అయితే టీడీపీ గెలిచినట్లే…!

ఈసారి గెలవకపోతే…. ఇక భవిష్యత్తు లేదనేది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే అని ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేసేశారు కూడా. ఇందుకోసం గతానికి భిన్నంగా దాదాపుగా రెండేళ్ల ముందు నుంచే చంద్రబాబు కదన రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఎన్నికలకు ఏడాది ముందే మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక చేసేస్తూ… పార్టీ శ్రేణులను సైతం ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. ఈ సారి అవకాశం లేకపోతే… ఇక మరో ఛాన్స్ రాదేమో అనే భయం కూడా ప్రస్తుతం టీడీపీ నేతల్లో ఉంది. ఇవే తనకు చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఓ వైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధినేత ఇంతలా కష్టపడుతుంటే… క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ నేతలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఓటర్లకు వివరించి… వారిని టీడీపీ వైపు మళ్లేలా చూడాలనేది చంద్రబాబు మాట. అయితే నియోజకవర్గం స్థాయి నేతలు మాత్రం… ఏదో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు అనేలా పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పార్టీ ఓడిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారనేది వాస్తవం. పార్టీ నేతలంతా యాక్టివ్ అయ్యేందుకు.. ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని 2022 జనవరిలో చంద్రబాబు హింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒంగోలులో నిర్వహించిన మహానాడుతో నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చినట్లైంది. ఒంగోలు మహానాడు తర్వాత ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు నేతలంతా. అప్పటి వరకూ ర్యాలీలు, ధర్నాలతో సరిపెట్టిన నేతలు… ఇప్పుడు మాత్రం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన టాస్క్ పూర్తి చేస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించారు. ముందుగా బాదుడే బాదుడు అంటూ ఇంటింటికీ తిరిగి పెరిగిన ధరల గురించి ఓటర్లకు వివరించారు. ఆ తర్వాత ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి అంటూ అభిప్రాయాలు సేకరించారు. ఇక రాజమండ్రి మహానాడు నుంచి భవిష్యత్తుకు గ్యారెంటీ అంశం పట్టుకున్నారు. మినీ మ్యానిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని పార్టీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులను కూడా జిల్లాలకు పంపారు. రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదో అనే అనుమానం ఉన్న నేతలు.. బస్సు యాత్ర బాధ్యతను కిందిస్థాయి కార్యకర్తలకు అప్పగించేశారు. క్షేత్రస్థాయిలో తిరగాల్సిన నేతలు బస్సు యాత్రలతో సరి పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్‌ దగ్గరకి మాత్రం వెళ్లడం లేదనే అపవాదు మూటగట్టుకున్నారు. ఓ వైపు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైసీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతుంటే… టీడీపీ నేతలు మాత్రం… బస్సు యాత్ర పేరుతో ఏసీ బస్సుల్లో తిరుగుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం ఇప్పటికే అధినేత వరకు చేరడంతో.. ఇలా చేసే వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు కూడా. ఇప్పటికైనా.. నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కిందిస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు.