అమరావతిలో జగన్ పాచిక పారుతుందా….?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే ఇప్పటి నుంచే గెలుపు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2019లో టీడీపీకి అనుకూలంగా నిలిచిన జిల్లాలు విశాఖ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు మాత్రమే. మిగిలిన అన్ని చోట్ల ఎదురుదెబ్బలే తగిలాయి. చివరికి రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓడిపోయింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. అయితే 3 రాజధానుల ప్రతిపాదన తర్వాత రాజధాని అమరావతి పరిధిలో వైసీపీకి ఓటమి తప్పదనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ఈ సారి ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా గెలుపు కోసం జగన్ మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మరోసారి నారా లోకేశ్ పోటీ చేయనున్నారు. దీంతో లోకేశ్‌ను ఓడించాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బదులుగా… నియోజకవర్గంలో మెజారిటీ శాతం ఓటర్లున్న పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాలనేది జగన్ ఆలోచన. అందులో భాగంగానే టీడీపీ నేత గంజి చిరంజీవులును పార్టీలో చేర్చుకున్నారు జగన్. అలాగే మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వీరిద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఖాయంగా కనిపిస్తోంది.

ఇక తాడికొండ నియోజకవర్గంపై కూడా జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే డా.ఉండవల్లి శ్రీదేవి పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ. దీంతో ఈసారి అక్కడ నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి దిగడం ఖాయం. అయితే అమరావతి పరిధిలోని రైతులకు బదులుగా.. కొత్త ఓటర్లను చేర్చడం ద్వారా గెలుపు మరింత సులువవుతుందనేది జగన్ ఆలోచన. అందుకే ఆర్ 5 జోన్ పరిధిలో ఇతర ప్రాంతాల పేదలకు సెంటు భూమి పట్టాలు పంపిణీ చేశారు జగన్. ఈ కారణంగా కొత్తగా దాదాపు 40 వేల ఓట్లను తాడికొండ నియోజకవర్గం పరిధిలో చేర్చినట్లైంది. ప్రభుత్వం ఇల్లు ఇచ్చినందుకు వీరంతా వైసీపీకి ఓట్లు వేస్తే.. గెలుపు సులువవుతుందనేది వైసీపీ నేతల లెక్క. మరి అమరావతిలో జగన్ పాచిక పారుతుందో లేదో చూడాలి.